Breast Cancer : క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. అది ముదిరేవరకు దీని లక్షణాలు బయట పడవు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుండగా చివరి స్టేజ్‌లో క్యాన్సర్ గుర్తించడం ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రొమ్ము క్యాన్సర్ సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాపాయం(Dangerous)గా మారుతుంది. ముందుగానే రొమ్ము క్యాన్సర్ గుర్తించడం ద్వారా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో క్యాన్సర్ గుర్తించే పరికారాలు(Equipments) చాలా ఖరీదైనవి. ఫలితాలు రావడానికి సమయం కూడా ఎక్కువగానే అవుతుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా సెకన్ల వ్యవధిలోనే రొమ్ము క్యాన్సర్ నిర్ధారించే అత్యాధునిక టెక్నాలజీతో కొత్త డివైజ్ త్వరలో అందుబాటులోకి రానుంది.
ఐదు సెకన్లలోపే కచ్చితత్వ ఫలితాలు.. :
అధ్యయనం(Research) ప్రకారం.. రొమ్ము క్యాన్సర్‌ను పరీక్షించే లాలాజల పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ప్రయోగాత్మక పరీక్షలో మంచి ఫలితాలను అందిస్తోంది. కొత్త హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌పై చుక్క నోటి లాలాజాలాన్ని వేస్తే చాలు.. కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే రొమ్ము క్యాన్సర్ బయోమార్కర్లను గుర్తించగలదు. ఈ అధ్యయనానికి సంబంధించి ఫ్లోరిడా యూనివర్శిటీ, తైవాన్‌లోని నేషనల్ యాంగ్ మింగ్ చియావో తుంగ్ యూనివర్శిటీ పరిశోధకులు తమ పరిశోధనలను జర్నల్ ఆఫ్ వ్యాక్యూమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీలో ప్రచురించారు. ఈ డివైజ్ పోర్టబుల్‌గా అరచేతి పరిమాణంలో ఉండగా, సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీని పరీక్ష సమయం ఐదు సెకన్లలోపు ఉంటుంది. ఫలితాలు కూడా అత్యంత ప్రభావవంతం(Effective)గా ఉంటుంది.
ధర కేవలం రూ.415 మాత్రమే :
కొత్త డివైజ్ లో ఒక పరీక్ష స్ట్రిప్‌పై లాలాజల(Saliva) శాంపుల్ ఉంచడం ద్వారా పనిచేస్తుంది. బయోసెన్సర్ పరికరంలోని కాంటాక్ట్ పాయింట్లను సిగ్నల్స్ ద్వారా కొలుస్తారు. ఫలితాలను త్వరగా సులభంగా అర్థం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు. పరీక్ష సమయంలో 21 మంది మహిళల ఆరోగ్యకరమైన రొమ్ము కణజాలం, ప్రారంభ రొమ్ము క్యాన్సర్, అధునాతన రొమ్ము క్యాన్సర్ మధ్య తేడాను ఈ డివైజ్ గుర్తించింది.
బయోసెన్సర్(Biosensor) డిజైన్ గ్లూకోజ్ టెస్టింగ్ స్ట్రిప్స్, ఓపెన్ సోర్స్ హార్డ్‌వేర్-సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్ ఆర్డునో వంటి సాధారణ భాగాలను ఉపయోగిస్తుంది. ఈ కొత్త టెస్టింగ్ డివైజ్ క్లినికల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తయారీ మద్దతుకు ఇతర కంపెనీలతో భాగస్వామ్యాన్ని కోరుతున్నారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టింగ్ డివైజ్ ధర రూ.415 మాత్రమే. స్ట్రిప్స్ ఒక్కొక్కటి కొన్ని సెంట్లు ఖరీదు ఉంటుంది.