క్యాన్సర్.. ఈ మాట వింటేనే అందరిలోనూ భయం కనపడుతుంది. ఇక దీని బారిన పడ్డవారైతే ఇక ప్రాణం పోయినట్లేనని కుమిలి కృశించిపోతారు. అయితే కేన్సర్ ముదిరిన తర్వాత కూడా దాన్నుంచి బయటపడ్డవారు ఉన్నారు. ఇలాంటివారిలో ఎక్కువగా మనకు సెలెబ్రిటీలు కనిపిస్తారు. అయితే ప్రపంచంలో ఊపిరితిత్తుల కేన్సర్ కన్నా రొమ్ము కేన్సర్ లే ఎక్కువని ఇంటర్నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్(IARC) తెలిపింది.
23 లక్షల మందిలో…
ప్రతి ఏడాది 23 లక్షల మందిలో కేన్సర్ ను గుర్తిస్తుండగా ప్రపంచంలో గుర్తిస్తున్న క్యాన్సర్లలో 12 శాతం రొమ్ము క్యాన్సర్లే ఉంటున్నాయి. దీని ద్వారా ఏటా 6.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని ముందే గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 2030 నాటికి ఏటా 27.4 లక్షల కేసులకు పెరగనుండగా… 8.57 లక్షల మరణాలు ఉంటాయట. అదే 2040 కల్లా 31.9 లక్షల కేసులు.. 10 లక్షలకు పైగా మరణాలు ఉంటాయని తేలింది.
గడచిన 5 సంవత్సరాల్లో 80 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడగా, దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరిలో దీన్ని గుర్తిస్తున్నారు. ప్రతి 8 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా, నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ(NCR)లో రికార్డు కాని కేసులు చాలా ఉంటున్నాయి. భారత్ తన GDPలో కేవలం 2.1 శాతాన్నే ఆరోగ్యరంగంపై వెచ్చిస్తుండగా.. రొమ్ము కేన్సర్ ట్రీట్మెంట్ విషయంలో డాక్టర్లు తగినంత లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి.
WHO సైతం…
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 2021లో ‘ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోగ్రాం(GBCI)’ ప్రారంభించగా.. 2040 కల్లా 25 లక్షల మందిని ఈ వ్యాధి నుంచి బయటపడేయాలన్నది లక్ష్యం. రొమ్ము కేన్సర్ పై అవగాహన పెంచడం, స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతోపాటు సమగ్ర చికిత్స అందించాలనేది GBCI టార్గెట్. స్వయంగా రొమ్మును టెస్ట్ చేయించుకుని వ్యాధి ఉందో లేదో గుర్తించే ‘క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్(CBE)’ మన దగ్గర చాలా కష్టమైన పని.
భారత్ లో వ్యాధి సోకిన ఏడాది తర్వాత ఎక్కువగా గుర్తిస్తున్నారు. 80 శాతం మందికి కీమోథెరపి, రేడియోథెరపి నిర్వహించాల్సి వస్తున్నది. తొలి దశలోనే 60 శాతం గుర్తిస్తే మాత్రం ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుంది. భారత్ లో ఏటా లక్ష మంది మరణిస్తుండగా, వ్యాధి సోకిన ప్రతి ఇద్దరిలో ఒకరు మరణిస్తున్నారు. అమెరికా, చైనాలో ఎక్కువ కేసులు ఉంటున్నా మరణాల్లో మాత్రం భారత్ లోనే ఎక్కువగా ఉంటున్నాయి.
నేషనల్ హెల్త్ మిషన్(NHM) కింద 2016 నుంచి దేశమంతటా CBE టెస్టులు చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఇప్పటివరకు 1 శాతం మంది మాత్రమే దాన్ని అమలు చేశారు. పాశ్చాత్య దేశాల్లో(Western Countries) 50 ఏళ్ల పైబడ్డ వారిలో కేన్సర్ కేసులు వస్తుంటే.. మన దేశంలో రికార్డయ్యే వాటిలో సగం 25-50 ఏళ్ల మధ్య ఉన్నవారిలోనే వెలుగుచూస్తున్నాయట.