చిన్నారుల్లో బయటపడిన కొత్త వ్యాధి హ్యూమన్ మెటాన్యుమో వైరస్(hMPV) గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. hMPV వ్యాప్తికి సంబంధించిన వార్తలు పెరగడంతో ఇక లాక్డౌన్(Lockdown) రాబోతున్నదా అన్న అనుమానాలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదని, 2001లోనే ఇది బయటపడిందంటూ వైద్య నిపుణులు చెప్పిన విషయాన్ని మంత్రి జె.పి.నడ్డా గుర్తు చేశారు. 2019-20లో ఇదే సమయంలో వచ్చిన కొవిడ్ వేగంగా విస్తరించి ప్రపంచ దేశాల్ని గడగడలాడించిన విషయాన్ని తాజా వైరస్ తో పోల్చుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు.
అటు విదేశాలతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబాలకు చెందిన పసికందులకు వ్యాధి సోకింది. ఇప్పటివరకు దేశంలో ఐదు కేసులు వెలుగు చూసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. బెంగళూరులో ఇద్దరికి, అహ్మదాబాద్ లో ఒకరికి వ్యాధి నిర్ధారణైంది. ముంబయిలోనూ కేసులు బయటపడ్డాయన్న ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. తమ రాష్ట్రంలో ఒక్క కేసూ లేదని ప్రకటించింది.