Published 18 Jan 2024
జ్వరమొస్తే(Fever) యాంటీబయాటిక్… తలనొప్పికి అదే మందు.. చివరకు దగ్గినా అవే యాంటీబయాటిక్స్. సాధారణంగా జ్వరం వస్తే రెండు మూడు రోజులు సాధారణ మందులు వాడి తగ్గని పరిస్థితుల్లో వ్యాధి ముదిరితే యాంటీబయాటిక్స్(Antibiotics) రాయాలి. ఇది నిపుణులైన డాక్టర్ల సలహాలతోనే తీసుకోవాలి. కానీ పల్లెల్లో తిరిగే ప్రాక్టీషనర్లు సైతం చిన్న చిన్న వాటికే ఈ రకమైన మందుల్ని(Medicine) వాడాలని చెబుతున్నారు. ఇక పెద్దాసుపత్రికి వెళ్తే యాంటీబయాటిక్స్ లేని మందుల చీటీ(Prescription) ఉండదంటే ఆశ్చర్యం లేదు. కానీ ఈ యాంటీబయాటిక్స్ ఔషధాల వల్ల మనిషి శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోయి చివరకు.. సాధారణ మందులు ఎందుకూ పనికిరాని స్థితికి చేర్చుతున్నాయి. అందుకే దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ తరహా మందుల్ని ఎందుకు వాడాలో స్పష్టంగా తెలపాలని ఆదేశాలిచ్చింది.
డాక్టర్లు, ఫార్మాసిస్టులు సైతం…
కొన్నిసార్లు డాక్టర్ల చీటీ లేకున్నా మెడికల్ షాపులకు వెళ్తే అక్కడే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. వాస్తవానికి ఈ మందులు ఇవ్వాలంటే డాక్టర్ల సూచనలు తప్పనిసరి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఫార్మాసిస్టులు, ఇంకా ఆ స్థాయి లేని వ్యక్తులు సైతం ఎడాపెడా ఈ మందుల్ని అంటగడుతున్నారు. ఇకనుంచి ఈ మందుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అవి ఇచ్చిన వారే బాధ్యులవుతారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రోగులకు యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి గల కారణాలతోపాటు అవి వాడటం ద్వారా ఏర్పడే ప్రయోజనాలకు సంబంధించిన సూచనలు ఉండాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. కారణాలు, సూచనల్ని సైతం మందుల చీటీలో రాయాలని ఆదేశించింది. డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఫార్మాసిస్టులు సైతం ఈ తరహా మందులు రాయాలని తెలియజేసింది.
కఠిన చర్యలే…
చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని గుర్తించిన వైద్య నిపుణుల బృందం… కేంద్రానికి సవివర నివేదిక అందజేసింది. వీటిని అరికట్టకపోతే భవిష్యత్తులో తలెత్తే పరిణామాల్ని ఊహించలేమని, మనుషులపై పడే దుష్ప్రభావాల్ని ఇప్పటికైనా ఆపాలని హెచ్చరించింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక నుంచి యాంటీబయాటిక్స్ విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది.