సరిగ్గా ఐదేళ్ల తర్వాత మరో వైరస్ పుట్టుకొచ్చింది. చైనాలోనూ వూహాన్ లోనే కరోనా పుట్టిందన్న వార్తలుండగా.. ఇప్పుడు హ్యూమన్ మెటానిమో వైరస్(hMPV) సైతం ఆ దేశం నుంచే మొదలైంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో జలుబు, కొవిడ్-19 వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది వేగంగా వ్యాపిస్తుందని వార్తలు వస్తున్న వేళ.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. శీతాకాలంలో వచ్చే వ్యాధుల మాదిరిగానే hMPV ఉంటుందని, పెద్దగా భయపడాల్సిన పనిలేదని ఆరోగ్యశాఖ చెబుతోంది. చైనా రాజధాని బీజింగ్ తోపాటు ఉత్తర, దక్షిణ చైనా ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దగ్గు, ముక్కు కారే టైంలో విడుదలయ్యే కణాల ద్వారా వైరస్ బయటకు రావడం, వాటిని తాకిన చేతులతో కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకుంటే సోకే అవకాశం ఉంది. షేక్ హ్యాండ్, కౌగిలింత, ఒకరినొకరు తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. 200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి పుట్టిందని, దాన్ని 2001లో మనుషుల్లో గుర్తించినట్లు అమెరికాకు చెందిన CDC(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తెలిపింది. దీనివల్ల జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఈ వైరస్ మూడు నుంచి ఆరు రోజుల పాటు బతికే అవకాశం ఉండగా… చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనికి గురించి మరీ అంత కలవరపడాల్సిన పనిలేదని, అనారోగ్యం అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.