Published 20 Dec 2023
గత వారం రోజుల నుంచి దేశాన్ని మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్న కొవిడ్-19 కేసులు అక్కడెక్కడో కాదు మన రాష్ట్రంలోని వచ్చేశాయి. దీంతో ఇక నుంచి మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ప్రమాద సైరన్లు మోగిస్తూ గత 24 గంటల్లో 6 కేసులు వెలుగుచూశాయి. 538 మందికి పరీక్షలు చేస్తే ఆరుగురిలో పాజిటివ్ లక్షణాలు(Positive Symptoms) కనపడ్డాయి. మరో 42 మంది అనుమానితుల రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. దేశంలో బయటపడుతున్న JN-1 వేరియంట్ ప్రాథమిక లక్షణాలపై కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల నుంచే అప్రమత్తమై రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
వేగంగా విస్తరిస్తున్న JN-1 వేరియంట్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు బయటపడగా ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.
RT-PCR టెస్టుల్ని మరింత పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇందులో JN-1 వేరియంట్ కు చెందిన 21 కేసుల్ని కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటకలో గుర్తించారు. మొత్తంగా గత 15 రోజుల్లో 16 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అమెరికా, చైనాల్ని బెంబేలెత్తించిన JN-1 వేరియంట్.. కేరళలోని తిరువనంతపురం జిల్లా కారాకులంలో ఈ నెల 8న బయటపడింది.