దేశ రాజధాని(Capital) ఢిల్లీ మరోసారి ప్రమాదం పడింది. దీపావళి వేళ బాణసంచా ప్రభావానికి తోడు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతుండటంతో వాయు నాణ్యత(Air Quality) దారుణ స్థాయికి చేరుకుంది. హస్తినలోని చాలా ప్రాంతాల్లో 395కు పైగా వాయు నాణ్యత పడిపోగా, అత్యధికంగా 398కి చేరుకుంది. దేశ రాజధాని మొత్తం పొగ కప్పేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దిశగా దూసుకుపోతున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(CPCB) హెచ్చరించింది.
దగ్గర వస్తువులు కూడా కనపడని రీతిలో పొగ అలుముకున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. పండుగ వేళ కాల్చిన టపాసులతో ప్రమాదం మరింత పెరిగింది. ఢిల్లీతోపాటు రాజధాని పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినా నిర్లక్ష్యం ఆగడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సాగవుతున్న వరి, గోధుమ పంటల వ్యర్థాల్ని తొలగించకుండా ఇష్టమొచ్చినట్లు కాల్చివేయడం ఒక కారణమైతే దీపావళి బాణసంచాతో ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోయింది.