
దేశ రాజధాని(National Capital) ఢిల్లీ మోస్ట్ డేంజరస్ పరిస్థితుల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో అత్యవసర చర్యలు(Emergency Services) చేపట్టాల్సి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో రోజూ సగం మంది సిబ్బందితోనే పనిచేయించాలని, ఢిల్లీకి వచ్చే అన్నిరకాల భారీ వాహనాల్ని ఆపేయాలని కేంద్రం ఇప్పటికే ఆర్డర్స్ ఇచ్చింది. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం ఇక నుంచి హైస్కూళ్లకు కూడా వర్తింపజేస్తున్నది. హస్తన ప్రజలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని హెల్త్ ఎక్స్ పర్ట్స్ వార్నింగ్ ఇచ్చారు. వాయు నాణ్యత సూచీ(Air Quality Index) గత 24 గంటల్లో 415 నుంచి 454కు చేరుకోవడంతో.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
మళ్లీ సరి, బేసి సిస్టమ్
ఢిల్లీలో పర్యావరణం దెబ్బతినడంతో కేజ్రీవాల్ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. గతంలో అమలు చేసిన సరి, బేసి విధానాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది. నిబంధనల ప్రకారం వాహనం చివరన గల రెండు అంకెల ఆధారంగా సరి ఉంటే ఒకరోజు, బేసి ఉంటే మరో రోజు నడపాల్సి ఉంటుంది.
తిట్టుకుంటున్న బీజేపీ, ఆప్
పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వరి కోతలు పూర్తయిన తర్వాత వాటికి మంట పెట్టి కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యం బారిన పడుతుందని ఆరోపిస్తున్నారు. BJP నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అక్కడి రైతులు ఎడాపెడా వరి గడ్డికి నిప్పు పెడుతున్నారని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ విమర్శించారు. దీనిపై ఢిల్లీ కమలం పార్టీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్ దేవ దీటుగా బదులిచ్చారు. ఆప్ ఆధ్వర్యంలోని పంజాబ్ లో 3,000 చోట్ల వరి పంటను కాల్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, భగవంత్ మాన్ సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.