Diabetes Symptoms : డయాబెటిస్.. ప్రపంచాన్ని వేధించే దీర్ఘకాలిక వ్యాధి.. ఒకసారి జీవితంలోకి వచ్చిందంటే మళ్లీ పోదు అంటారు. జీవితాంతం షుగర్ కోసం మందులు వాడాల్సిందేనని అంటుంటారు. అయితే, చాలామందిలో షుగర్ వచ్చిందని కూడా తెలియదు. ఎందుకంటే.. ఈ షుగర్ అనేది సైలెంట్ కిల్లర్.. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి అదుపులో ఉంచకపోతే అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీర అవయాలను(Body Parts)ను కూడా దెబ్బతిస్తుంది. గుండెజబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీయడంతోపాటు నరాలు దెబ్బతిని న్యూరోపతి వంటి అదనపు సమస్యలు చుట్టుముడుతాయి. మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి.
మీ షుగర్ లెవల్స్ ఎలా ఉంటున్నాయో ఓసారి చెక్ చేసుకోండి. షుగర్ అనగానే అందరికి ఒకేలా ఉంటాయని అనుకోవద్దు.. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మీ శరీరాన్ని బట్టి షుగర్ లక్షణాలు ఉంటాయి. మీలో ఈ కింది పేర్కొన్న విధంగా లక్షణాలు ఉంటే మాత్రం మీ షుగర్ లెవల్స్ ఎంత స్థాయిలో ఉన్నాయి అనేది తప్పక టెస్ట్ చేయించుకోండి. అందుకు తగిన విధంగా జాగ్రత్తలు(Pre Cautions) తీసుకోండి. ఏయే లక్షణాలు(Symptoms) ఉంటే షుగర్ వచ్చినట్టు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దాహం వేయడం అతి మూత్రం :
రక్తంలో అధిక స్థాయిలో షుగర్ ఉన్నప్పుడు ప్రధానంగా కనిపించే లక్షణాల్లో ఇదొకటి.. అధికంగా దాహం వేస్తుంటుంది. ఎంత నీళ్లు తాగినా పదేపదే నీళ్లు తాగాలనిపిస్తుంటుంది. గొంతు ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు.. నీళ్లు ఎన్నితాగినప్పటికీ అదే పనిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటారు. అతిగా మూత్రం వస్తుంటుంది అంటే కూడా షుగర్ అని అనుమానించాల్సిందే.. అంటే.. మూత్రంలో గ్లూకోజ్ వెళ్లిపోతుంది. కిడ్నీల పనితీరు మందగిస్తుంది.
ఆకలి పెరగడం లేదా బరువు తగ్గుతారు :
రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందిలో ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. కొంచెం కూడా ఆకలికి తట్టుకోలేరు. ఎంత తిన్నా కూడా ఒక్కసారిగా బరువు తగ్గిపోతుంటారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలో పెరగడం ద్వారా కొవ్వు, కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గిపోతారు. దాంతో సన్నగా మారిపోతూ క్రమంగా బలహీనమవుతారు.
తీవ్ర అలసట అనిపించడం :
రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. చాలామందికి తీవ్రమైన అలసటగా అనిపిస్తుంటుంది. ఏ కొంచెం పనిచేసినా వెంటనే అలసిపోతుంటారు. శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగినంతగా లేకపోవడమే దీనికి కారణం. ఇన్సులిన్(Insulin) ఉత్పత్తి(Production) నిలిచిపోతే రక్తంలో చక్కర స్థాయిలు అధికంగా పెరిగిపోతాయి. మూత్రవిసర్జన ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనివల్ల మరింత అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి.
దృష్టిలోపం.. తలనొప్పి :
షుగర్ ఉన్నవారిలో మరో ప్రధాన సమస్య చూపు మందగించడం.. ఓ అధ్యయనం ప్రకారం.. అధిక స్థాయిలో షుగర్ ఉన్నవారిలో కంటిచూపు తగ్గిపోతుంది. మసకగా కనిపించడం ఉంటుంది. దృష్టి కూడా మసకబారిపోతుంది. కంటినరాలు దెబ్బతిని అదేపనిగా తలనొప్పి వస్తుంటుంది.
ఏదైనా గాయమైతే తొందరగా మానకపోవడం.. మీకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తే.. షుగర్ వచ్చిందని అనుమానించవచ్చు. ఒకవేళ షుగర్ ఉంటే.. తగిలిన గాయం లేదా పుండు మానేందుకు చాలా రోజులు పడుతుంది. షుగర్ కారణంగా నరాల కూడా దెబ్బతింటాయి. దాంతో రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. సకాలంలో షుగర్ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. మీ సొంత వైద్యుడిని సంప్రదించి మీ షుగర్ లెవల్స్ గురించి చర్చించి తగిన చికిత్స తీసుకోవాలి.
Published 05 Feb 2024