తినే ఆహారాన్ని వృథా చేయడం వల్ల దేశ పురోగతి సాధ్యపడదని, దాన్ని కాపాడుకోవడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భిన్న ఆహారపు అలవాట్ల(Food Diversity)కు నిలయమైన భారత్ లో ఫుడ్ ప్రాసెసింగ్ కల్చర్ పెద్దయెత్తున పెరిగిందన్నారు. వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 సదస్సును ప్రారంభించిన ప్రధాని.. దేశ ఫుడ్ ప్రాసెసింగ్ 13% నుంచి 23%నికి పెరిగిందని తెలిపారు. ప్రాసెసింగ్ ఫుడ్ ఎక్స్ పోర్ట్స్ విషయంలో ఈ తొమ్మిదేళ్లలో 150 శాతం పెరుగుదల ఉందని, ప్రస్తుతం ఈ రంగం స్టార్టప్ కంపెనీలకు సువర్ణావకాశమని గుర్తు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి చెందాలంటే సన్నకారు రైతులు, చిరుద్యోగులు, మహిళల పాత్రే కీలకమన్నారు. ప్రాసెసింగ్ ఫుడ్ అనేది ఫిజికల్ పరంగానే కాకుండా మానసిక ఎదుగుదలకు గొప్పగా ఉంటుందన్నారు.
50 వేల మిలియన్ డాలర్లతో 7వ స్థానం
దేశ ఫుడ్ ప్రాసెసింగ్ 12 లక్షల టన్నుల నుంచి 200 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని, విదేశాలకు పెద్దయెత్తున ఆహార పదార్థాల్ని ఎక్స్ పోర్ట్స్ చేసే స్థాయికి చేరుకుంటున్నామని మోదీ అన్నారు. అగ్రో ఎక్స్ పోర్ట్స్ లో 50,000 మిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉన్నామని తెలిపారు. పురాతన కాలంలో ఆహారపు అలవాట్లు(Food Habits) అనేది ఆయుర్వేదంలా ఉండేదని, మారిన పద్ధతుల వల్ల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయని గుర్తు చేశారు. జీ20 ఢిల్లీ సదస్సు సందర్భంగా మన మిల్లెట్లపై ప్రపంచం ఆసక్తి కనబరిచిందని, దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది చిన్నారులతోపాటు మహిళలు, గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నామని మోదీ తెలిపారు.