Published 26 Jan 2024
ఆహారం తిన్న వెంటనే టీ, కాఫీలు తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త…!
ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే టీ(Tea) లేదా కాఫీ(Coffee) తాగకపోతే ఆ రోజు అంతా ఏదో వెలితిగా అనిపిస్తుందని చాలామంది ఫీలవుతుంటారు. లేవగానే కడుపులో టీ లేదా కాఫీ పడితే తప్ప డే(Day) స్టార్ట్ కాదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి టీ, కాఫీలను ఎప్పుడుపడితే అప్పుడు తాగడం ద్వారా కలిగే ఉపశమనం కన్నా ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు(Health Experts). ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే కాఫీ, టీలు తాగడం చాలామందికి అలవాటు కాగా.. ఇలా చేయడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. టీ లేదా కాఫీతో పాటు.. తీసుకునే ఆహారం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందవు.
అజీర్ణ సమస్యలకు దారితీస్తుంది :
కొంతమంది అయితే ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా టీ, కాఫీలు తాగేస్తుంటారు. స్వీట్లు, భోజనం చేసిన తర్వాత ఎక్కువగా వీటిని తీసుకుంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా హానికరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. టీ, కాఫీలు ఆమ్లత్వ గుణాన్ని కలిగి ఉంటాయి. తద్వారా కడుపులో ఎసిడిటీ(Acidity)కి దారితీస్తుంది. మరెన్నో అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. తిన్న ఆహారానికి విరుద్ధంగా కాపీ, టీల ద్వారా కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. దాంతో వికారం లేదా వాంతులు, ఇతరేతర జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
అందుకే భోజనం పూర్తి చేసిన వెంటనే కాఫీ లేదా టీని తాగొద్దని చెబుతుంటారు. శరీరంలో జీర్ణం కావాల్సిన ఆహారం సరిగా జీర్ణం కాదు. దానికితోడు అజీర్త సమస్య ఏర్పడుతుంది. తిన్న ఆహారం ద్వారా శరీరానికి అందాల్సిన పోషకాలు కూడా అందకుండా పోతాయి. టీ లేదా కాఫీలలో టానిన్లు, పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. దాంతో తిన్న ఆహారంతో కలిగే అసలైన ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతాం.
ఐరన్ లోపంతో అనీమియా ముప్పు :
ఇదే అలవాటు దీర్ఘకాలంగా కొనసాగిస్తే శరీరంలో ఐరన్ లోపానికి దారితీస్తుంది. ఒకసారి ఐరన్ లోపం వచ్చిందంటే.. అనీమియా బారినపడతారు జాగ్రత్త. అంతేకాదు.. ప్రతి ఇంట్లో సాధారణ అల్పాహారంలో పెరుగు, పచ్చళ్లను వేడి టీతో తీసుకుంటారు. ఈ కలయిక జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. వికారం కలిగించవచ్చు. అందుకే టీ వంటి వేడి పానీయాన్ని తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు చల్లని ఆహారం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
లెమన్ టీ కూడా హానికరమే :
లెమన్ టీ తాగినప్పుడు అసిడిక్ రియాక్షన్ వస్తుందని ఎవరైనా చెప్పడం విన్నారా? నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. మీకు వికారంగా ఉన్నట్టు అనిపించవచ్చు. నిమ్మరసం టీ అనేది ఆమ్ల స్వభావం కలిగిస్తుంది. కడుపులో వాపును కలిగిస్తుంది. ఉదయాన్నే లెమన్ టీ తాగకూడదని నిపుణులు సూచించడానికి అసలు కారణం ఇదే.