Published 05 Dec 2023
శరీర ఉష్ణోగ్రతల వల్ల చాలా మంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. జలుబు, దగ్గు వంటి రెగ్యులర్ వ్యాధులతో అవస్థలు పడుతుంటారు. కానీ శరీర ఉష్ణోగ్రతల్ని తగ్గించే ఫలాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అందులో మొదటి స్థానంలో ఉండే పండు సీతాఫలం. ఈ ప్రకృతిలో కొన్ని రకాల పండ్లు కొన్ని సీజన్లలో మాత్రమే దొరుకుతాయి. ఈ సీజనల్ ఫ్రూట్స్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని నిపుణులు అంటుంటారు. సీతాఫలం(Custard Apple)లో షుగర్ తప్ప ఇంకేమీ ఉండదనేది చాలా మంది అపోహ. అందుకే సీతాఫలాన్ని ముట్టుకోవడానికి షుగర్ పేషెంట్లు భయపడుతుంటారు. మరోవైపు ఇది తినడం వల్ల జలుబు కూడా అవుతుందని నమ్ముతారు. కానీ పండ్ల వల్ల జలుబు రాదనే విషయం తెలియకే ఇలా అపనమ్మకానికి గురవుతారంటున్నారు వైద్య నిపుణులు.
రుచితోపాటు చలువ
సీతాఫలం వల్ల అమోఘమైన లాభాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఈ పండు మన శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. శీతాకాలంలో మాత్రమే లభించే చల్లని పండు అయిన సీతాఫలం.. రుచిలో ఎంత తియ్యగా ఉంటుందో ఆరోగ్యపరంగా కూడా అంతే మంచిదట. శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లలో దీనికి ప్రముఖమైన స్థానం ఉందని చెబుతున్నారు. దీని ద్వారా లభించే విటమిన్ ‘బి’ ద్వారా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని అంటున్నారు. ఇందులో కేలరీలు అధికంగా ఉండటంతో బరువు పెరిగే వారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
ఐరన్ పుష్కలం…
సీతాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి బాగా మేలు చేస్తుంది. ఇలాంటి రోగులకు సీతాఫలాన్నే తినాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇందులోని విటమిన్ ‘బి’ కాంప్లెక్స్.. మెదడులో ప్రెజర్ ను తగ్గించే సాధనంగా కూడా ఉపయోగపడుతుంటుంది. అందులో దొరికే పీచు పదార్థం సైతం శరీరంలోని టాక్సిన్స్ ను సులభంగా తొలగించడంతోపాటు ఎసిడిటీ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపుతుందని వైద్య పరిశోధనల్లో(Medical Researches) తేలింది.