
మందులతో ఒళ్లు గుల్ల చేసుకుంటున్న పేదలకు ప్రయోజనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ మాఫియాకు అడ్డుకట్ట వేసేలా ‘జనరిక్’ మందుల్ని పేదల వద్దకే తీసుకెళ్లాలని చూస్తున్నది. ఇందుకోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(PACS)ల్లో వీటిని అమ్మాలని ప్రతిపాదనలు రెడీ చేస్తున్నది. అదే జరిగితే ఇక పల్లెల నుంచి మందుల కోసం పట్నాలకు వెళ్లే అవసరం తగ్గుతుంది. అటు బ్రాండెడ్ మందుల పేరిట సాగుతున్న దోపిడీకి చెక్ పడుతుంది. మామూలుగా PACSల ద్వారా ఎరువులు, విత్తనాలు అమ్ముతుండగా ఈ మధ్యనే పెట్రోల్ బంకులు కూడా పెట్టారు. ఈ బంకులతో మంచి ఆదాయం పొందుతున్న సహకార సంఘాలు.. ఇంకా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో ‘జనరిక్’ మందులు అమ్మేందుకు కేంద్రం సిద్ధం చేస్తున్నది. నగరాలు, టౌన్లకే పరిమితమైన ‘జనరిక్’ మందుల్ని గ్రామీణ ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్రం పనులు స్టార్ట్ చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఇది అమలైతే 10 రూపాయలకు దొరికే మందులు రూ.3 నుంచి రూ.5 లోపే లభిస్తాయి.
తెలంగాణలో కొత్త జిల్లాల వారీగా ఈ షాపులు ఏర్పాటు కానున్నాయి. 2008 ఏప్రిల్ 23న ప్రధానమంత్రి జన ఔషధ పరియోజన స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఫార్మాస్యూటికల్స్, కేంద్ర ప్రభుత్వ ఔషధ విభాగం కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతానికి 8,000 రకాల మందులు, సర్జరీలకు సంబంధించిన మెడిసిన్స్ దొరుకుతున్నాయి. వీటి కింద మరిన్ని రకాల మందులు చేరుస్తూ వాటి అమ్మకాలను PACSలకు అప్పగించాలని కేంద్రం డిసైడ్ అయింది. అయితే దీని గైడ్ లైన్స్ రావాల్సి ఉండగా.. స్టోర్లు కేటాయించిన తర్వాత సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ అందుతుంది. అప్పట్నుంచి కేంద్రం అధీనంలోని ఫార్మాస్యూటికల్ కంపెనీల ద్వారా.. PACSలకు మందులు సప్లయ్ అవుతాయి. ‘జన ఔషధి స్టోర్’ మంజూరైన PACSలు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ డాక్యుమెంట్స్ ను సమర్పించాల్సి ఉండగా.. ఈ స్టోర్ల నిర్వహణకు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, లేదంటే డాక్టర్, బీఫార్మసీ, డీఫార్మసీ కలిగిన ఎవరో ఒకరిని PACSలు మెయింటెయిన్ చేయాలి.
డాక్టర్లు కంపల్సరీగా ‘జనరిక్’ మందులే రాయాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC కొద్ది రోజుల క్రితం ఆదేశాలిచ్చింది. ఈ మెడిసిన్ రాయకపోతే డాక్టర్లకు ఫైన్ వేయడంతోపాటు లైసెన్స్ ను కొంతకాలం రద్దు చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇవ్వడంతో IMA అలర్ట్ అయింది. అన్ని మందులు ఇప్పటికిప్పుడు దొరకడం కష్టమని, ఆ ఆర్డర్స్ ను వెనక్కు తీసుకోవాలని కోరింది. డ్రగ్ కంపెనీలు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు డాక్టర్లు వెళ్లకూడదన్న NMC నిర్ణయంపైనా పునరాలోచన చేయాలని IMA కోరింది. ‘జనరిక్’ మందులకు ఆదరణ పెరిగితే మెడికల్ మాఫియా అతలాకుతలం అవుతుంది. వేలాది కోట్ల టర్నోవర్ కు అడ్డుకట్ట పడుతుంది. మరోవైపు డాక్టర్లు ఎవరికి వారే మెడికల్ షాపులు నిర్వహిస్తూ కొన్ని కంపెనీల మందులనే రాస్తున్నారు. ఆయా కంపెనీల రిప్రజంటేటివ్స్ రెగ్యులర్ గా డాక్టర్లను కలుస్తూ మీటింగ్స్, సెమినార్స్ తో అట్రాక్ట్ చేస్తుంటారు. ఇలా తక్కువ రేట్లకే మందులు సప్లయ్ చేయడమే కాకుండా స్పెషల్ ఇన్సెంటివ్స్ డాక్టర్లకు ఇస్తుంటారు. అలాంటి కొందరు డాక్టర్లు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ‘జనరిక్’ మందులంటే భయం పట్టుకుంది. అవి సరిగా పనిచేయవనే భావన ఏర్పడింది. అటు NMC, ఇటు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. ఇక నుంచి ‘జనరిక్’ మందులు పేద ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.