Published 31 Dec 2023
యువత ఆరోగ్యమే(Youngsters Health) దేశానికి పెద్ద సంపద అని, దాన్ని కాపాడుకోవడమే ప్రధానం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సహజ ఆహార పదార్థాలు, తృణధాన్యాల వల్ల శారీరక రుగ్మతలు తొలగిపోతాయన్నారు. ఆదివారం నాడు నిర్వహించే ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆయన.. గతేడాది భారత్ సాధించిన విజయాల్ని గుర్తు చేసుకున్నారు. శారీరక దృఢత్వం మానసిన పరిపక్వతకు కారణంగా నిలుస్తుందని, 2023ను ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ప్రకటించిన విషయాన్ని వివరించారు. చంద్రయాన్-3 ప్రయోగం దేశ కీర్తి ప్రతిష్ఠల్ని అమోఘంగా పెంచిందన్న ప్రధాని.. దేశానికి యువత పెద్ద ఆస్తి అని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023లోనే ఆమోదం లభించడం, జీ20 సదస్సు విజయవంతం కావడం అపురూప క్షణాలని అన్నారు.
‘మేకిన్ ఇండియా’ సక్సెస్ ఫుల్ గా నడుస్తుందనడానికి ఉదాహరణ మొన్నటి దీపావళియేనని… ఆ పండుగ సందర్భంగా దేశీయ తయారీ రంగం కొత్త చరిత్రకు నాంది పలికిందని ప్రధాని కొనియాడారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్ లో 111 పతకాలు.. వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రతిభ.. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు.. ఇవన్నీ దేశ ప్రతిష్ఠను ఇనుమడించడమే కాకుండా అందరి మనసుల్ని గెలుచుకున్నాయని మోదీ గుర్తు చేసుకున్నారు.