చైనాలో మరో వైరస్(Virus) వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. హ్యూమన్ మెటానిమోవైరస్(hMPV) పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ తో పలు రకాల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయన్న వార్తలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది మనదేశంలో ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రభావం చూపకున్నా, కరోనా కాలం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. చలికాలంలో సాధారణంగా వచ్చే జలుబు, జ్వర లక్షణాల వంటివి పెరగడం ద్వారా భిన్న వైరస్ లు పిల్లలు, వృద్ధులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని తెలిపింది. ఏం చేయాలో, ఏం చేయకూడదో కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరింది.
చేయాల్సినవి…
* దగ్గు, జలుబు వంటివి ఉంటే నోరు, ముక్కు కవర్ అయ్యేలా కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ వాడటం.
* నీళ్లు, సబ్బు, అల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తో తరచుగా చేతులు కడగటం.
* దగ్గు, జ్వరం లక్షణాలుంటే జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడం.
* నీరు ఎక్కువగా తాగడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం.
* బయటి నుంచి గాలి బాగా వచ్చేలా వెంటిలేటర్ల ఏర్పాటు.
* అనారోగ్య లక్షణాలు ఏమాత్రం కనిపించినా బయటకు వెళ్లకపోవడం.
* తగినంత నిద్ర ఉండటం.
చేయకూడనివి…
* షేక్ హ్యాండ్స్ ఇవ్వడం.
* వాడిన కర్చీఫ్/టిష్యూ పేపర్లు మళ్లీ వాడటం.
* అనారోగ్యం అనిపించిన వ్యక్తులతో దగ్గరగా మాట్లాడటం.
* కళ్లు, ముక్కు, నోటిని తరచూ ముట్టుకోవడం.
* పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయడం.
* డాక్టర్(ఫిజిషియన్) కన్సల్టేషన్ లేకుండా సొంతంగా మందులు వాడటం.