Published 22 Dec 2023
పారిశ్రామిక విధానం(Industrialised) రాకతో దేశాల స్థితిగతుల్లో అపారమైన మార్పు వచ్చింది. యాంత్రీకరణ(Mechanisation) వల్ల ప్రొడక్టివిటీ పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. అయితే ఈ యాంత్రీకరణ వల్ల ఉపాధి పెరిగిందే కానీ మనుషుల ఆయుష్షు మాత్రం తగ్గిపోతున్నదట. పని విధానంలో వచ్చిన మార్పులు, ఆదాయాల పెరుగుదలతో మానవుల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. శరీరం నుంచి చెమట చుక్క రాలే పరిస్థితి లేకపోవడం వల్లే జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ విషయాలు ఓ అధ్యయనం ద్వారా బయటకు వచ్చాయి. గుండె సంబంధిత వ్యాధులకు అతి పెద్ద రీజన్ యాంత్రీకరణనేనంటూ
వరల్డ్ హార్ట్ ఫెడరేషన్(WHF) అనే సంస్థ వెల్లడించింది. ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కార్డియో వాస్క్యులర్ డిసీజ్(CVD). హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అంశాలన్నీ ఈ CVD పరిధిలోకే వస్తాయి.
లైఫ్ స్టైలే అతి పెద్ద డేంజర్
నాటి కాలంలో ఇంత పెద్ద రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కువగా కాళ్లకు పని చెప్పేవారు. ఆ నడక ద్వారా లభించే వ్యాయామం అంతాఇంతా కాదు. కానీ ఈ రోజుల్లో నడవడం మానేసి 100 మీటర్ల దూరం వెళ్లాలన్నా బైక్ తీసే పరిస్థితి ఉంది. ఇలాంటి లైఫ్ స్టైల్స్ వల్లే గుండె జబ్బులు వస్తున్నాయని WHF చెబుతోంది.
హై బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, శారీరక వ్యాయామం లేకపోవడంతో CVD వస్తున్నదని తన రీసెర్చ్ ద్వారా తెలియజేసింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు ఉద్యోగం హడావుడే తప్ప హెల్త్ పై పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదట. రెగ్యులర్ హెల్త్ చెకప్ ల ద్వారా 75 శాతం జబ్బుల్ని ముందుగానే గుర్తించడం వల్ల బతికి బయటపడవచ్చని WHF అంటోంది.
పేద, మధ్యతరగతి దేశాల్లోనే…
కార్డియో వాస్క్యులర్ డిసీజ్(CVD) మరణాలు 1990లో 1.21 కోట్లు ఉంటే.. 2021 నాటికి అది 2.50 కోట్లకు చేరుకుంది. 2021లో చోటుచేసుకున్న ప్రతి ఐదు మరణాల్లో నాలుగు.. దిగువ, మధ్యతరగతి ఆదాయం గల దేశాల్లోనివే. భారత్ లో ఎక్కువగా యువతపై ఎఫెక్ట్ చూపిస్తోందని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హార్ట్ ఎటాక్స్ భారీగా పెరిగిపోతున్నాయని వార్నింగ్ ఇస్తోంది. పారిశ్రామిక విధానంలో మార్పులతో భారతీయుల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం.. మెకనైజేషన్ వల్ల కూర్చున్నచోటే పనిచేయాల్సి రావడం, ఆదాయ మార్గాలు పెరగడంతో సుఖాలకు అలవాటు పడి శారీరక శ్రమను కోల్పోతున్నారని తేలింది. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, హై బీపీ, ఒబెసిటీ, డయాబెటిస్, అధిక ఒత్తిడి వల్ల హార్ట్ ఎటాక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి.
ముందుచూపు గల దేశాల్లో
ప్రపంచవ్యాప్తంగా చూస్తే పేద, మధ్యతరగతికి చెందిన దేశాల్లోనే హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. CVD మరణాల శాతం ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకెట్ మనీతోపాటు ఆస్తులు సైతం అమ్ముకుని వైద్యానికి పెట్టాల్సి వస్తున్నది. గుండె జబ్బుల విషయంలో కొన్ని దేశాల ముందు జాగ్రత్త చర్యలు అక్కడి పౌరుల ఆయుష్షును బాగా పెంచుతున్నాయి. ఆయా దేశాల్లో చేపడుతున్న ముందస్తు జాగ్రత్తల వల్ల 80 శాతం మేరకు హార్ట్ ఎటాక్స్ ను నివారిస్తున్నట్లు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ రీసెర్చ్ ద్వారా స్పష్టమైంది. వైద్యంపై శ్రద్ధ చూపని దేశాల్లో అధిక వ్యయాలు ఆరోగ్య రంగంపైనే వెచ్చించాల్సిన ప్రమాదం ఏర్పడింది. ఇక దేశ GDP(Gross Domestic Product)లో హెల్త్ కేర్ పై ఎక్కువ వెచ్చిస్తున్న దేశాల్లో గుండె సంబంధిత మరణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.