
Published 23 Jan 2024
చలికాలం అంటే జలుబు, దగ్గు మాత్రమే కాదు.. గుండెపోటు(Heart Attack) కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణం(Cool Weather) మీ గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే, చలికాలంలో ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదానికి అనేక అంశాలు కారణమవుతాయి. రక్త నాళాలు, హృదయ ధమనులు చలికి ప్రతిస్పందనగా సంకోచిస్తాయి. ఫలితంగా రక్తపోటు పెరగడంతోపాటు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దాంతో గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అదనంగా, సాధారణ శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉండేందుకు శీతాకాలంలో మీ గుండె కష్టపడి పని చేస్తుంది. అందువల్ల, శీతాకాలంలో నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి మీకు ముందుగా గుండె జబ్బులు ఉంటే… శీతాకాలంలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోండి.
గుండె ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు :
శారీరకంగా చురుకుగా ఉండండి :
చాలామందికి ఇది కఠినంగా అనిపించవచ్చు. కానీ, శీతాకాలంలో శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. బయట కాకపోయినా మీరు యోగా, డ్యాన్స్, సున్నితమైన ఏరోబిక్స్ వంటి కొన్ని ఇండోర్ వ్యాయామాలు చేయవచ్చు. చలికాలంలో బరువు పెరగకుండా కూడా సాయపడుతుంది. వ్యాయామం అనేది శరీరానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. బద్ధకాన్ని వీడి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఒక అలవాటుగా చేసుకోవాలి. అప్పుడే మంచి ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు.
మంచి పోషకాహారాన్ని తీసుకోండి :
ఆరోగ్యకరమైన ఆహారం గుండెను రక్షించడంలో సాయపడుతుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, గింజలు, చిక్కుళ్ళు, ఆరోగ్యకర కొవ్వులు ఎక్కువగా తినడం చాలా అవసరం. అలాగే, ఉప్పు, చక్కెర, ఆల్కహాల్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, పిండి పదార్థాలు, అనారోగ్యకరమైన కొవ్వుల వినియోగాన్ని బాగా తగ్గించండి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లేదంటే గుండె జబ్బులను కొనితెచ్చుకుంటారు జాగ్రత్త.
హెల్తీ కొలెస్ట్రాల్, రక్తపోటు సరైన స్థాయిలో ఉండాలి :
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు మరో ప్రధాన ప్రమాద కారకంగా చెప్పవచ్చు. ఈ సమస్యలు ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో కొలెస్ట్రాల్, రక్తపోటు రెండూ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, మీ స్థాయిలను ఎప్పటికప్పుడూ చెక్ చేయడం, తదనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి :
చల్లని వాతావరణం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం సమయంలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఈ చల్లటి వాతావరణం మీ హృదయాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేయగలదు. అందుకే వెచ్చగా ఉండడమే దీనికి పరిష్కారంగా చెప్పవచ్చు. మీ శరీరం వెచ్చదనంగా ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు ధరించే దుస్తులు కూడా మందంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ శరీరం తగినంత వెచ్చదనంతో ఉంటుంది. మీకు ఇప్పటికే గుండె జబ్బు ఉంటే.. చలి రోజులలో ఇంట్లోనే ఉండండి. చలిగాలుల్లో బయట అస్సలు తిరగవద్దు.
మధుమేహం, ఇతర ఆరోగ్య పరిస్థితులు :
అనియంత్రిత మధుమేహంతో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. మూత్రపిండాలు, రక్తనాళాలు, రక్తపోటు సమస్యల వంటివి ఇప్పటికే ఉన్నా.. వైద్యపరమైన సమస్యలపై కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లయితే రెగ్యులర్ చెక్-అప్‌లకు వెళ్లడం తప్పనిసరి. ఇలాంటి విషయాల్లో అసలు అశ్రద్ధ చేయకూడదని గమనించాలి. లేదంటే ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉంది.