Published 18 Dec 2023
మూడేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి మరోసారి కొత్తరూపు సంతరించుకుంది. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే కొన్ని దేశాలను చుట్టుముడితే తాజాగా మన దేశంలోనూ వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టిన కేంద్ర వైద్యారోగ్యశాఖ.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వార్నింగ్ పంపింది. దేశంలో JN-1 వేరియంట్ ప్రాథమిక లక్షణాలు(Primary Symptoms) వెలుగుచూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏ మాత్రం కొవిడ్ లక్షణాలు కనిపించినా వెంటనే RTPCR టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెనింగ్ కు పంపుతూనే ప్రతి జిల్లాపైనా నిఘా పెట్టి పరిస్థితిని సమీక్షించాలని స్పష్టం చేసింది. ఇంతకుముందులా రెగ్యులర్ గా చేతులు కడుక్కోవడం, మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎక్కడ బయటపడింది…
అమెరికా, చైనాల్లో ఇప్పటికే స్థిరపడ్డ JN-1 వేరియంట్ మన దేశంలోకి వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. కేరళలోని తిరువనంతపురం జిల్లా కారాకులంలో ఈ నెల 8న కొవిడ్-19కు సంబంధించిన JN-1 వేరియంట్ ను గుర్తించారు. దీన్ని పిరోలా లేదా, BA అనే జాతి నుంచి మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. JN-1 వేరియంట్ అనేది మునుపటి ఒమిక్రాన్ జాతులలో చాలా లక్షణాలు కలిగి ఉన్నా.. నాడీ వ్యవస్థపై గతానికి కన్నా భిన్నంగా అధిక ప్రభావం చూపే అవకాశాలున్నందున ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతులో మంట వంటి ప్రాథమిక లక్షణాలు వ్యాధి సూచనలు కాగా.. 4-5 రోజుల్లోనే దీని వ్యాప్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడే దీనిపై నిర్ధారణకు రాలేమని, JN-1 వేరియంట్ అనేది గత వేరియంట్ల కన్నా ఏ మేరకు ప్రభావం చూపిస్తుందన్న దానిపైనే సీరియస్ నెస్ కనబర్చాల్సి ఉంటుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.