Published 23 Dec 2023
చలికాలంలో హిమపాతం కన్నా కొవిడ్ కేసులు గజగజ వణికిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు అత్యంత వేగంగా వ్యాప్తి(Rapid Spread) చెందడమే ఈ భయాలకు కారణం. రెండేళ్ల సంక్షోభ పరిస్థితుల తర్వాత సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాధి వ్యాపిస్తూనే ఉంది. గత మే తర్వాత నిన్న ఒక్కరోజే అత్యధిక కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 752 కేసులు బయటపడ్డట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తన బులెటిన్ లో ప్రకటించింది. 2023 మే 21 తర్వాత ఈ స్థాయిలో కేసులు వెలువడటం ఇదే తొలిసారి కాగా.. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి చేరింది. ఇందులో కొవిడ్-19 సబ్ వేరియంట్ అయిన JN-1 కేసులు 22 ఉండగా, అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ టూరిజం ప్లేస్ అయిన గోవాలో 21 కేసులు, మరొకటి కేరళలో నిర్ధారణయ్యాయి. బుధవారం నాడు 640 మందిలో పాజిటివ్ లక్షణాలు బయటపడగా.. గురువారం నాడు వాటి సంఖ్య పెరిగినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఆ దేశాల్లో డేంజరస్ ఇండికేషన్స్
కొవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్ని భయానికి గురిచేస్తున్నాయి. సింగపూర్ లో అంతకంతకూ పెరుగుతున్నా అక్కడ ప్రత్యేక చర్యలంటూ తీసుకోవడం లేదు. కానీ దేశంలో ప్రజలంతా మాస్కును తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందేనంటూ అక్కడి ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. అటు అమెరికాలోనూ ఆందోళన కనపడుతోంది. క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా జనాలు పెద్దయెత్తున గుమికూడే అవకాశమున్నందున కొవిడ్ మరింత వ్యాపిస్తుందన్న భయంతో ఉంది. ఇప్పటికీ వ్యాక్సినేషన్ తీసుకోనివారి వల్లే వైరస్ వ్యాపించే ఛాన్సెస్ ఉన్నాయని US వైద్య నిపుణులు చెబుతున్నారు.