ఠాగూర్ సినిమాలో చనిపోయిన మృతదేహానికి చికిత్స అందించినట్లే.. హైదరాబాద్ హాస్పిటల్లోనూ అదే సీన్ రిపీటైంది. మియాపూర్ మదీనగూడలోని సిద్ధార్థ ఆసుపత్రిలో మృతదేహాని(Dead Body)కి రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో రంగారెడ్డి DMHO వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు, వైద్య బృందాలు సిద్ధార్థ హాస్పిటల్లో తనిఖీలు(Searches) చేశారు. అక్కడకు వెళ్లిన కొంతమందిని హాస్పిటల్ సిబ్బంది బెదిరించారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
ఏం జరిగిందంటే…
26 ఏళ్ల యువతి కళ్లు తిరిగి పడిపోతే కడప జిల్లా నుంచి హైదరాబాద్ సిద్ధార్థ న్యూరో ఆసుపత్రికి తరలించారు. నెల రోజుల్నుంచి చికిత్స అందిస్తూ పెద్దమొత్తంలో బిల్లు తీసుకున్నారు. ఇంకో రూ.5 లక్షలు కట్టాలని చెప్పారు. కానీ ఈనెల 8న ఇక బిల్లు కట్టాల్సిన పనిలేదని ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసుకోండంటూ కుటుంబసభ్యులకు తెలిపారు. బాధితురాల్ని ఆమె తల్లిదండ్రులు నిమ్స్ కు తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డు డాక్టర్లు పరిశీలించి ఆమె చనిపోయిందని చెప్పడంతో ఆమె మృతదేహాన్ని తిరిగి సిద్ధార్థ హాస్పిటల్ తరలించారు. ఇలా ఈ విషయాల్ని కుటుంబ సభ్యులు బయటపెట్టారు. మూణ్నాలుగు రోజుల క్రితమే మరణించినా సమాచారమివ్వలేదని బంధువులు ఆందోళనకు దిగారు.