హైదరాబాద్ నందినగర్‌లో మయోనైజ్ తిని మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ(Food Safety) అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారుచేస్తున్న ఆ పదార్థాన్ని ఏడాది పాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మయోనైజ్ ను వాడకుండా హోటళ్లు, ఫుడ్ స్టాళ్లలో రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఇప్పటికే 235 హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్స్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 170 సంస్థలకు నోటీసులిచ్చారు. అన్ని జిల్లాల్లోనూ నిఘా కోసం రెండు టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. మోమోస్ సహా వివిధ రకాల ఆహార పదార్థాలను మయోనైజ్ తో కలిపి తింటుండగా, కేరళ తరహాలో ఇక్కడా దాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2025 చివరి వరకు నిషేధం అమల్లో ఉండేలా మంత్రి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఉత్తర్వులు ఇచ్చారు.