
Published 31 Dec 2023
వైద్య చరిత్రలో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. అనుకోని వ్యాధితో మరణం అంచుకు చేరిన పసికందును బతికించిన డాక్టర్లు.. నిజంగా దేవుళ్లనిపించారు. రెండు నెలల పసికందుకు ‘బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్(Bone Marrow Transplant-BMT)’ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. వైద్య చరిత్రలోనే అద్భుతానికి వేదికైన ఈ ఘట్టం ముంబయిలో జరిగింది. అనిశా బండేకర్ అనే రెండు నెలల చిన్నారిని 19 రోజుల వయసులో ముంబయిలోని పారెల్స్ వాడియా హాస్పిటల్ కు తరలించారు. ‘బబుల్ బేబీ’గా నామకరణం చేసిన వైద్యులు.. ఆమెను ప్రత్యేక పర్యవేక్షణ(Observation)లో ఉంచారు. ‘సివియర్ కంబైన్డ్ ఇమ్యునోడెఫిషియెన్సీ(Severe Combined Immunodeficiency-SCID)తో చిన్నారి బాధపడుతోంది. పుట్టుకతోనే ఇమ్యునిటీ లోపంతో జన్మించిన ‘బబుల్ బేబీ’.. కళ్లు తెరిచిన నాటి నుంచీ మరణశయ్యపై ఉండిపోవాల్సి వచ్చింది.
దాత దొరకడంతో…
అదృష్టం పాప పక్షాన ఉండటం.. దేవుళ్ల లాంటి డాక్టర్లు తోడవడం.. వారి కృషికి నిదర్శనమన్నట్లు సరైన సమయంలో దాత(Donor) దొరకడం చకచకా జరిగిపోయాయి. దాత నుంచి సేకరించిన ‘స్టెమ్ సెల్స్’ను పరీక్షించి మ్యాచ్ చేసుకున్న తర్వాత బాధిత ‘బబుల్ బేబీ’కి సర్జరీ ప్రారంభించారు. చివరకు ఆమె ప్రాణాలు నిలబెట్టారు. ‘కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని రక్షించడం మా అదృష్టం.. ఇలాంటివి వైద్య చరిత్రలోనే అత్యంత అరుదు.. కర్ణాటక మంగళూరులోని కార్వార్ వైద్యులను మెచ్చుకోవాలి.. వారు సమయానికి సరైన సలహా ఇవ్వడం వల్లే పసికందును మా దగ్గరకు తీసుకురాగలిగారు’.. అంటూ వాడియా ఆసుపత్రి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ హెడ్ డా.ప్రశాంత్ హివార్కర్ అన్నారు.
మొదటి బిడ్డ మరణంతో…
అనిశా తల్లిదండ్రులకు మొదటి సంతానమైన 11 నెలల చిన్నారి.. వివిధ ఇన్ఫెక్షన్లతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మంగళూరు డాక్టర్లకు అప్పడే డౌట్ వచ్చింది. మీకు ఇంకో చిన్నారి ఉంటే మా దగ్గరకు తీసుకురావాలని చెప్పడంతో ఈమె తండ్రి గీతేశ్ బండేకర్… ఈ ‘బబుల్ బేబీ’ని తొలుత అక్కడకు తీసుకెళ్లారు. కార్వార్ లో చిన్న కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న బండేకర్.. తన 19 రోజుల పసిబిడ్డను డాక్టర్లకు అప్పగించడంతో పరీక్షలు స్టార్ట్ చేశారు. ఆ టైమ్ లోనే వారికి నమ్మలేని నిజం తెలిసింది. అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి ఇక బతకదని నిర్ధరించుకున్నారు. కానీ అందరిలా తాము ఉంటే ఇక డాక్టర్లుగా ఎందుకు అన్న భావనతో… ఏదో ఒకటి చేయాలని మథనపడ్డారు. తీవ్రంగా శోధించి హుటాహుటిన ముంబయి తరలించాలని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ‘బబుల్ బేబీ’ని పారెల్స్ వాడియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. SCIDతో బాధపడుతూ చిన్నారి నవంబరు 9న హాస్పిటల్ లో జాయిన్ అయితే నాలుగు రోజుల క్రితం ఆమెను విజయవంతంగా డిశ్చార్జి చేశారు.
ఆర్నెల్ల పాటు అబ్జర్వేషన్ లోనే…
శస్త్రచికిత్సతో ప్రాణాలు దక్కించుకున్న ‘బబుల్ బేబీ’.. మరో ఆర్నెల్ల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్ లోనే ఉంటుందని వాడియా హాస్పిటల్ సీఈవో డా.మిన్నీ బోధన్ వాలా తెలిపారు. దాత స్వచ్ఛందంగా ఇచ్చిన స్టెమ్ సెల్స్ వల్లే పాప బతికిందని.. దేశంలోనే అతి పిన్న వయసులో చేసిన ‘బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ఇదేనని చెప్పారు. ఈ చిన్నారి విషయంలో అన్నీ సకాలంలో కుదిరాయని… ముందస్తు పరీక్షలు, డాక్టర్ల నిర్ధారణ, దాత ఉదారత కలిసి రావడంతో మిగతా పనిని తాము పూర్తి చేశామని ఆనందం పంచుకున్నారు. దేశంలో BMT సెంటర్ల సంఖ్య పెరుగుతున్నా.. వాటిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరముందని ముంబయి విలే పార్లేలోని నానావతి హాస్పిటల్ కు చెందిన హెమటాలజిస్ట్(రక్త సంబంధిత) డా.ముకేశ్ దేశాయ్ గుర్తు చేశారు. ఇలా వైద్య పరిభాషలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు నిజంగానే దేవుళ్లుగా మిగిలిపోయారనడంలో సందేహం లేదు.