కేరళలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన వైద్య వర్గాల్లో కలకలం రేపుతోంది. నిపా వైరస్ వల్లే వీరు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నది. దీనికి గల కారణాలు గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వం నిపుణుల కమిటీ(Experts Committee) ఏర్పాటు చేసింది. 2018లో తొలిసారిగా కేరళలో నిపా వైరస్ కేసు వెలుగుచూసింది. అలా 2021 వరకు ఈ కేసులు బయటపడగా.. ఓ బాలుడి మెదడులో దీన్ని గుర్తించారు. తాజాగా మరోసారి ఈ వ్యాధి వెలుగులోకి వచ్చిందా అన్న కోణంలో ఆ రాష్ట్రంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి.
ఏమిటీ నిపా వైరస్…!
గబ్బిలాల వల్ల వ్యాపించే నిపా వైరస్ కు ప్రత్యేకమైన చికిత్స గానీ, టీకాలు లేకపోవడం ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. కొవిడ్ తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత డేంజరస్ అని వైద్య శాఖ వర్గాలు అంటున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం చెట్ల మీద పండ్లపై పడటం.. ఆ ఫ్రూట్స్(Fruits) రసాల్ని తాగడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు తేల్చారు. ఒకరి స్రావాల ద్వారా మరొకరికి వ్యాపించే ఈ వ్యాధి.. కేరళలో మళ్లీ వెలుగుచూసిందన్న వార్త సంచలనం కలిగించింది. నోరు, ముక్కు, రక్తం, మూత్రం నుంచి వచ్చే స్రావాల్లో ఇది ఉంటుందని చెబుతున్నారు. వ్యాధి సోకిన వ్యక్తితో క్లోజ్ కాంటాక్ట్ కలిగినవారికి ఈ వైరస్ త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది. నిపా వైరస్ ను తొలిసారి 1999లో మలేషియాలో గుర్తించారు.