
దేహ దారుఢ్యం(Physic) కోసం పడుతున్న శ్రమ దేహాన్నే దోచేస్తోంది. కండలు కనపడాలని బండలు ఎత్తితే చివరకు గుండెలు పేలిపోతున్నాయి. ఆరోగ్యం ఏమో కానీ అసలు మనిషే లేకుండా పోతున్నాడు. జిమ్ లో చేస్తున్న ఎక్సర్ సైజ్(Exercise) లు మంచి మంచి వ్యక్తుల్ని పొట్టనబెట్టుకుంటున్నాయి. వ్యాయామం చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు చూస్తే ఎందుకిలా జరుగుతుందబ్బా అని ఆరా తీయడం మొదలైంది. ఇంకేముంది అది వినడానికి హెల్త్ న్యూస్ ల వెంబడి పడటం చూస్తున్నాం. కానీ అతి వ్యాయామాలు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన ఎక్సర్ సైజ్ ల వల్ల గుండెపై భారం, ప్రెజర్ పడుతున్నదట. ఫాస్ట్ గా వ్యాయామం చేస్తున్న సమయంలో ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని గుండె మరింత బలంగా పంపింగ్ చేస్తుంది. దీంతో గుండె మీద ఒత్తిడి పెరిగి హఠాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు.
ఎక్సర్ సైజ్ లు చేసే టైమ్ లో బాడీలో నీరు తగ్గకుండా చూసుకోవాలట. అంటే అతిగా చెమట రూపంలో వెళ్లినా శరీరం అలసటకు గురవుతుంది. వ్యాయామాలు స్టార్ట్ చేయడమే కాదు.. ఎప్పుడు ఆపివేయాలో కూడా తెలిసి ఉండాలంటున్నారు. బాగా తిన్న తర్వాత కొద్దిసేపటికే కసరత్తులు చేయడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకేసారి తీవ్రంగా కాకుండా మెల్లమెల్లగా మొదలుపెట్టి క్రమంగా ఎక్సర్ సైజ్ ను పెంచుకుంటూ పోతూ ఉంటే శరీరం అందుకు తగ్గట్లుగా సహకరిస్తుందని ఎక్స్ పర్ట్స్(Experts) చెబుతున్నారు.