పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు అందించే కార్యక్రమం ఈ రోజు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ను అమలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ‘నేషనల్ ఇమ్యునైజేషన్ డే(National Immunization Day)’ సందర్భంగా పల్స్ పోలియోను నిర్వహిస్తున్నారు. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. ఆసుపత్రులతోపాటు వాడవాడలా, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు.
వారం కింద వేసినా…
వారం రోజుల కిందట పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలకు సైతం ఈరోజు మళ్లీ వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యారోగ్య శాఖ ప్రచారం చేస్తున్నది. అయితే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి మాత్రం చుక్కలు వేయకూడదని అంటున్నారు. ఈ టీకాల వల్ల పోలియో, తట్టు, క్షయ, టైఫాయిడ్ వంటి రోగాల నుంచి బయటపడుతున్నాం. ఈ చుక్కల వల్ల ఈ నాలుగు రకాల వ్యాధులే కాదు.. శరీరంలోని మిగతా రోగాలపైనా ప్రభావం చూపడంతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పోలియో, బీసీజీ టీకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల మరణాలు తగ్గిపోయాయి.