Published 22 Jan 2024
అసలే చలికాలం(Winter).. అందులోనూ చల్లని వాతావరణం కారణంగా గాలి పొడిగా ఉంటుంది. దాంతో గొంతులో చికాకు కలిగి తద్వారా పుండ్లు పడటానికి దారితీస్తుంది. చలికాలంలో సాధారణ జలుబు, ఫ్లూ(Flu) వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు(Viral Infections) ఎక్కువగా వేధిస్తుంటాయి. తరచుగా గొంతు(Throat) నొప్పి రావడం సాధారణ లక్షణంగా కనిపిస్తుంటుంది. శీతాకాలంలో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుంటారు. ఎండ తగలక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. ఇక ఈ కాలంలో గొంతు నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందాలంటే ఆయుర్వేద చిట్కాలతో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. మీ ఇంట్లోనే లభించే వంట దినుసులతో గొంతు నొప్పిని తొందరగా తగ్గించుకోవచ్చు. ఈ ఆరోగ్య చిట్కాలను ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పిని నయం చేయడంలో సాయపడే 5 ఆయుర్వేద మూలికలు ఉన్నాయి..
తులసి (పవిత్ర తులసి) :
తులసిలో యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గొంతు నొప్పికి కారణమయ్యే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సాయపడతాయి. ఒక ఎక్స్పెక్టరెంట్గా కూడా పనిచేస్తూ శ్వాస సమస్యలను నివారించడంలో అద్భుతంగా సాయపడుతుంది. తులసి ఆకులను తినడం లేదా నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం ద్వారా కూడా గొంతునొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందొచ్చు.
Also Read: రూ.20 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే…
అల్లం :
అల్లం(Ginger) శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. గొంతులో మంటను తగ్గించడంతోపాటు దగ్గు(Cough) నుంచి తొందరగా ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం సహజ అనాల్జేసిక్గా పనిచేస్తుంది. తాజా అల్లంను నీటిలో వేసి తేనె(Honey), నిమ్మరసం కలిపి తయారుచేసిన అల్లం టీని తీసుకోవచ్చు. ఇలా చేస్తే గొంతు నొప్పి లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
పసుపు :
పసుపు అనేది ఒక యాంటీబయాటిక్.. ఇందులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ(Inflamatory) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతులో నొప్పి, వాపు, మంటను తగ్గించడంలో సాయపడుతుంది. ఒక టీస్పూన్ పసుపు, తేనెతో కలిపి గోరువెచ్చని పాలను తీసుకోవడం వల్ల పసుపులోని యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గొంతు నొప్పిని వేగంగా తగ్గించడంలో సాయపడుతుంది.
దాల్చిన చెక్క :
దాల్చినచెక్కలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలున్నాయి. గొంతు నొప్పి, వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తూ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దాల్చిన చెక్కను కొద్దిగా తీసుకుని నోటిలో వేసుకుని మెల్లగా నమలడం ద్వారా తొందరగా గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే.. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తాగడం ద్వారా గొంతులో నొప్పిని నయం చేసుకోవచ్చు.
లవంగాలు :
లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. గొంతు నొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. లవంగాలు గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్లపై పోరాడి వెంటనే సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి.
ఉసిరికాయ :
ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం సహా అంటువ్యాధులను నివారిస్తుంది. గొంతు నొప్పి లక్షణాల నుంచి అతివేగంగా ఉపశమనాన్ని అందిస్తుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించడంలో ఈ ఆయుర్వేద మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. సీజన్ పరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడంలో గొంతు మంటను తగ్గించడంతోపాటు నొప్పిని నివారించి రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి.
ఆయుర్వేద చిట్కాలు అనేవి కేవలం రోగలక్షణ ఉపశమనాన్ని అందించగలవు. గొంతు నొప్పికి సంబంధించిన అంతర్లీన కారణాన్ని నేరుగా నయం చేయలేవని గమనించాలి. ప్రత్యేకించి, బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా గొంతునొప్పి వచ్చినా అది తీవ్రతరం అయితే.. సరైన రోగ నిర్ధారణ, సరైన చికిత్స కోసం వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.