
గణేశ్ ఉత్సవాలు వస్తున్నాయంటేనే ఆ సంబరానికి హద్దుండదు. రంగురంగుల లైట్లు, వాడవాడలో సౌండ్లు.. ఊరు, పట్టణమనే తేడా లేకుండా సాగే సందడి అంతా ఇంతా కాదు. చాలా చోట్ల కుల, మతాలకతీతంగా పండుగ జరుపుకొంటారు. నవరాత్రుల పాటు స్వామిని కొలుస్తూ 24 గంటలూ మండపాల వద్దే కాలం గడపటం ఆనవాయితీ. ఇదంతా ఒకవైపు అయితే… డీజేలు, డ్యాన్సులు, రకరకాల పాటలతో చిందులు వేసే పరిస్థితి ఇంకోవైపు. ఇక నిమజ్జనాల సమయంలో ఎంత చెప్పినా తక్కువే. కానీ రానురానూ పరిస్థితిలో పూర్తి మార్పులు కనపడుతున్నాయి. గతేడాది ఉత్సవాలు, ఇప్పటి నవరాత్రులతో పోల్చుకుంటే పూర్తి డిఫరెంట్ వాతావరణం కనిపిస్తున్నది. ఇప్పుడు ఎక్కడ చూసినా భక్తి పారవశ్యంతో కూడిన పాటలే వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ దైవ చింతన సాక్షాత్కరిస్తూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి మనసులకు ఆహ్లాదాన్నిచ్చేలా వినాయక నవరాత్రులు నిర్వహించుకుంటున్నారు. దీన్ని చూసి ఎంతలో ఎంత మార్పు అని అనుకుంటున్నారు చాలా మంది. డీజేలు, సినిమా పాటలతో మండపాల వద్దకు రావాలంటేనే ఇబ్బందికర పరిస్థితులున్న వాతావరణం నుంచి.. కేవలం భక్తి పాటలే వేస్తూ విఘ్నేశుని దగ్గరకు రప్పించేలా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటున్నది.
సోషల్ మీడియా పుణ్యమేనా
యువతలో ఇంత మార్పు రావడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది.. ఒక్కసారిగా ఈ స్థాయిలో భక్తి భావం పెరగడానికీ రీజన్ ఏంటి…! ఈ అన్నింటికీ ఏకైక కారణం సోషల్ మీడియానే అని చెప్పవచ్చు. హిందూ సంస్కృతి గురించి, పండుగ విశేషాలు, నవరాత్రి ఉత్సవాల గురించి ఎంతో కాలంగా విస్తృతంగా ప్రచారం సాగుతున్నది. వీటిపై సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు. హిందూ సంఘాలు, భక్తి తత్పరతతో కూడిన సమాజం పెడుతున్న పోస్టులతో అందరిలోనూ ఆలోచన మొదలైంది. మనం ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న ధోరణి సరికాదన్న చైతన్యం ఏర్పడింది. ఇప్పటివరకు తమ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పెద్దగా పట్టించుకోని కుటుంబ పెద్దలు సైతం.. సోషల్ మీడియా పుణ్యమా అని మారిపోయారు. సెల్ ఫోన్లలో వస్తున్న మెసేజ్ లతో ఎవరికి వారు చైతన్యవంతమై తమ పిల్లలకు ఏది మంచో ఏది చెడో దగ్గరుండి చెబుతున్నారు. మరోవైపు హిందూ సంఘాలు సైతం ఈ విపరీత ధోరణిపై దృష్టిసారించాయి. చెడు సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే తొలుత హిందూ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన తీసుకురావడమే మంచిదని భావించి.. ప్రతి సందర్భానికి అనుగుణంగా దానికి గల ప్రాధాన్యతను వివరిస్తూ పోస్ట్ లు తయారవుతున్నాయి.
ఫోన్లలో వచ్చే పోస్ట్ లే పాఠాలుగా
ఉదాహరణకు ఒక పండుగ వస్తుందంటే.. ఆ పర్వదినానికి ఉన్న ప్రాశస్త్యాన్ని(చరిత్రను) తర్వాతి తరాలకు చెప్పగలగాలి. ఇలా చెప్పాలంటే ముందుగా ముందుతరం వారికి అవగాహన(Awareness) ఉండాలి. కానీ ఈ స్థాయిలో సమాచారం దొరికే అవకాశం చాలా మందికి ఉండేది కాదు. కానీ సామాజిక మధ్యమాల ఫలితంగా ఇప్పుడు అందరిలోనూ అవగాహన ఏర్పడుతున్నది. పండుగకు మూడు రోజుల ముందు నుంచే వెల్లువెత్తుతున్న పోస్ట్ లతో ఆ పండుగ అంటే ఏమిటి.. దాని వెనుక గల పరమార్థం.. ఇలా అన్నింటిని తెలుసుకోగలుగుతున్నారు. అలాంటి పోస్ట్ లను చూసి వదిలేసే నవతరం ఉన్నా… వాటిపై అవగాహన కల్పించే పాతతరం వాళ్లముందే ఉంటుంది కాబట్టి.. దగ్గరుండి మరీ తమ పిల్లలకు వివరంగా తెలియజేస్తున్నారు. పిచ్చి పిచ్చి డ్యాన్సులతో మన స్థాయిని మనమే తగ్గించుకుంటున్నామన్న ధోరణి ఇప్పుడు అంతటా కనిపిస్తున్నది. అందుకే వినాయక మండపాల వద్ద పూర్తి భక్తిపారవశ్యమే తాండవిస్తున్నది.
ఇది కదా మన దేశ సంస్కృతి అంటూ చాలామంది లోలోపలే సంతోషపడుతున్నారు.
Excellent explanation about celebration of ganapati navaratri utsav. Thanks to justpoatnews