15 నుంచి 19 ఏళ్ల వయసులోనే అమ్మాయిలు ఎక్కువగా గర్భం దాల్చుతున్నారని(Pregnancy) నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5(NFHS) ద్వారా వెల్లడైంది. దేశవ్యాప్తంగా 7 శాతం మంది 15-19 ఏళ్ల వయసులో గర్భవతులు అవుతుండగా.. అందులో 5 శాతం మంది ప్రసవిస్తున్నారని తేల్చింది. అయితే పెరుగుతున్న ఎడ్యుకేషన్ వల్ల టీనేజ్ గర్భధారణ క్రమంగా తగ్గిపోతుందని తెలిపింది. దేశంలోని 15-19 ఏళ్ల వయసు గల వివాహితల్లో 53% మంది ఇప్పటికే సంతానం పొందడం మొదలైందని, జాతీయ వివాహ వయసు కన్నా ముందుగానే తల్లులవుతున్నట్లు NFHS-5 ప్రకటించింది. 18 ఏళ్ల వయసును పరిగణలోకి తీసుకుంటే 5 శాతం మంది 17 ఏళ్లకే కడుపులో బిడ్డను మోస్తున్నారని తేలింది. ఇక 18-19 ఏళ్ల వయసులో 31 శాతం మందికి పిల్లలు కడుపులో పడుతున్నారు. అయితే ఇందులో బలహీనవర్గాలకు చెందినవారే టీనేజ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటున్నారని తన రిపోర్ట్ లో NFHS-5 తెలియజేసింది.
మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
టీనేజ్ ప్రెగ్నెన్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. 12 శాతం ప్రెగ్నెన్సీలతో AP థర్డ్ ప్లేస్ లో ఉంది. ఈ విషయంలో త్రిపుర 22%తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 16%తో పశ్చిమ్ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. NFHS-5 డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో సుమారు మూడో వంతు 29.3% మందికి.. వివాహ వయసు రాక ముందే 18 ఏళ్ల లోపే పెళ్లి చేసుకోవాల్సి వస్తున్నది. దేశవ్యాప్త సగటు(23.3%) కన్నా అధికంగా AP(29.3%)లోనే ఎక్కువ మంది బాల్య వివాహాలు చేసుకుంటున్నారు. రూరల్ ఏరియాల్లో ఇది 32.9%గా, పట్టణ ప్రాంతాల్లో 21.7%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ గణాంకాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 52 శాతం మంది తల్లిదండ్రులు లేదా మేనమామలు.. తమ అమ్మాయిలను 18 ఏళ్ల లోపే సాగనంపాలని(బాల్యవివాహాలు) చూస్తున్నారని ఛైల్డ్ రైట్స్ అండ్ యూ(Child Rights And You-CRY) అనే NGO 2022లో జరిపిన సర్వేను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గుర్తు చేసింది. కేవలం 22 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే ఛైల్డ్ మ్యారేజెస్ కు వ్యతిరేకమంటూ CRY అనే NGO ఇచ్చిన రిపోర్ట్ ను ఇందుకు ఎగ్జాంపుల్ గా NFHS-5 వివరించింది.
STలు, ముస్లింలలో ఎక్కువ
షెడ్యూల్ తెగ(ST)ల్లో టీనేజ్ సంతానం ఎక్కువగా ఉన్నట్లు NFHS-5 డేటా ద్వారా బయటపడింది. ఈ తెగలో టీనేజ్ సంతానం 9%గా ఉందని.. వీరి తర్వాత ముస్లింల్లో 8% మంది యుక్త వయసులోనే సంతానం పొందుతున్నారని పేర్కొంది. సంపన్న కుటుంబాల్లోని టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చడమన్నది కేవలం 2%గానే ఉన్నట్లు.. అత్యధిక సంపాదన కలిగిన కుటుంబాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ చాలా తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఇందులో తెలంగాణ 5.8%తో 13వ స్థానంలో ఉంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ జాతీయ సగటు 6.8 కాగా APలో అంతకు రెండింతలు ఉండగా.. తెలంగాణ ఆ లోపునే నిలిచింది.