శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడంలో ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. ఇందుకు కొన్ని రకాల విటమిన్లు ఎంతగానో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి బాగుంటే వైరస్, బ్యాక్టీరియా వంటివి ఒంటి దరి చేరవు. తొలుత విటమిన్ ‘A’ను పరిశీలిస్తే.. వ్యాధులతో పోరాడే తెల్లరక్త కణాలు యాక్టివ్ గా ఉండేలా ఇది పనిచేస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా విటమిన్ ‘A’ను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతుంటారు. గుడ్లు, చేపలు, బొప్పాయి, మామిడి పండ్లు, పాలకూర, క్యారెట్ వంటివి తీసుకుంటే బాగుంటుంది.
‘B’ విటమిన్లలో ‘B6’, ‘B12’ ఎంతో మేలు చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెద్దయెత్తున పెంచడానికి ఉపయోగపడతాయి. గుడ్లు, చికెన్, చేపలు, ఆలుగడ్డ, శనగల వల్ల ఈ రెండు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అరటి పళ్లతో ‘B6’ వృద్ధి చెందగా… గుడ్లు, చేపలు, మాంసంతో ‘B12’ దొరుకుతుంది. విటమిన్ ‘E’ అంటే యాంటీ ఆక్సిడెంట్. తెల్లరక్త కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది. విటమిన్ ‘E’ లోపమున్న వారిలో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అలర్జీ, అస్తమా వంటివి పెరుగుతుంటాయి. అందుకే పాలకూర, పల్లి, బాదం, గోధుమలు తినాలంటున్నారు. ఇలాంటి పదార్థాల వల్ల విటమిన్ ‘E’ భారీగా డెవలప్ అవుతుందంటున్నారు.
ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ‘C’ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యంత శక్తిమంతమైన ఆక్సిడెంట్లలో దీనికి మొదటి స్థానం ఉంది. విటమిన్ ‘C’కి శరీరంలో నిల్వ ఉండే అవకాశం లేదు. అందుకే రోజూ ఇది దొరికేలా ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. జామ, నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరికాయ వంటి పులుపు రకాల పండ్లతోపాటు పచ్చి మిరప, ఆలుగడ్డ, కొత్తిమీర వల్ల విటమిన్ ‘C’ ఎక్కువగా దొరుకుతుంది. ఇక విటమిన్ ‘D’ సైతం రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి సహకరిస్తుంది. చర్మానికి ఎండ తగిలినప్పుడు ఆటోమేటిక్ గా విటమిన్ ‘D’ దొరుకుతుంది. గుడ్డులోని పచ్చ సొన వల్ల కూడా ఈ విటమిన్ లభిస్తుండటంతో దీన్ని అధికంగా తీసుకోవాలంటారు.
Excellent