డాక్టర్ కావాలంటే ఏ సబ్జెక్టులు చదవాలి.. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ(BiPC) తప్పకుండా చదివితేనే డాక్టర్ అవుతారు. ఇంటర్ లో ఈ కోర్సు పూర్తి చేసినవారే డాక్టర్ కావడానికి అర్హులు. కానీ ఇక నుంచి ఇంటర్ లో బయాలజీ లేకున్నా.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తోనూ MBBS, BDS చదవొచ్చు. ఇలాంటి వెసులుబాటు కల్పిస్తూ జాతీయ వైద్య కమిషన్(National Medical Commission) ఆదేశాలిచ్చింది. అయితే ఇంటర్మీడియట్ లో కాకుండా అడిషనల్ సబ్జెక్టుగా జీవశాస్త్రం(Biology) లేదా బయోటెక్నాలజీ(Bio-technology) పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. ఇంటర్ తర్వాత అదనపు సబ్జెక్టులుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులను పూర్తి చేసిన అభ్యర్థులు NEET-UG ఎగ్జామ్ రాయడానికి అర్హులుగా పేర్కొంటూ NMC ఉత్తర్వులు ఇచ్చింది.\
పాత విధానానికి స్వస్తి
ఇప్పటివరకు MBBS, BDS చదవాలంటే ఇంటర్ లో ప్రాక్టికల్స్ సహా ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ స్టడీని పూర్తి చేసి ఉండాలి. ఇది ఓపెన్ స్కూల్ లేదా, ప్రైవేటు అభ్యర్థిగా కాకుండా రెగ్యులర్ విధానంలో కంప్లీట్ చేయాలన్నది నిబంధన. వీటిని మరింత సరళీకరించాలన్న ఉద్దేశంతో NMC.. డాక్టర్ కోర్సు విధివిధానాల(Guidelines)పై సుదీర్ఘ సంప్రదింపులు జరిపింది. నీట్-యూజీ పరీక్షకు ప్రమాణాల్ని సడలించాలన్న అంశంపై జూన్ 14న ఫైనల్ డిసిషన్ కు వచ్చింది. 11, 12 తరగతుల్లో ప్రధాన సబ్జెక్టుగా బయాలజీ చదవకపోయినా డాక్టర్ డిగ్రీని అభ్యసించేందుకు వెసులుబాటు కల్పిస్తూ అసాధారణ నిర్ణయం తీసుకుంది. జాతీయ వైద్య కమిషన్ తాజా ఉత్తర్వులతో ఇక పాత సిస్టమ్ కు తెరపడనుంది. అదనపు సబ్జెక్టుగా బయాలజీ/బయోటెక్నాలజీని ఎంచుకునేవారు మన దేశంతోపాటు ఫారిన్ లోనూ వైద్య విద్య చదివేందుకు అర్హులని క్లారిటీ ఇచ్చింది.
మంచి సమాచారం