దేశ రాజధాని(National Capital) ఢిల్లీలో పరిస్థితి విషమంగా తయారైంది. వాయు నాణ్యత బాగా క్షీణించి ప్రజలకు బయటకు రావడం లేదు. వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు రోడ్లపై తిరగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 150 మీటర్ల దూరంలోని వాహనం కనపడటం లేదంటే పొల్యూషన్ ఎంత పెరిగిందో అర్థమవుతుంది. ఈ రోజు పొద్దున 7 గంటలకు ఢిల్లీ వ్యాప్తంగా AQI(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 483కు చేరుకుంటే.. ముండ్కా(Mundka)లో మాత్రం 919, ఐటీఐ జహంగీర్ పురిలో 762, ఆనంద్ విహార్లో 624గా నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(CPCB) ప్రకటించింది.
దీన్ని బట్టి ప్రపంచంలోనే అత్యధికంగా AQI రికార్డయ్యే పాకిస్థాన్ కరాచీని మించిపోయింది ముండ్కా ప్రాంతం. మరోవైపు చాలా ప్రాంతాల్లో AQI 500 దాటినట్లు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) తెలిపింది. 10, 12 తరగతులు మినహా మిగతా అన్ని క్లాసుల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాఠాలు వినాలి. ఢిల్లీ ఉద్యోగులకు రోజు విడిచి రోజు డ్యూటీలు వేస్తే.. కేంద్ర ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే నిర్ణయాన్ని మోదీ సర్కారుకే వదిలేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆప్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. స్టేజ్-3 నుంచి స్టేజ్-4కు మారడానికి మూడు రోజుల టైమ్ ఎందుకు వేస్ట్ చేశారంటూ మండిపడింది.