కార్చిచ్చు(Fire)కు కాలిఫోర్నియా అతలాకుతలమైతే మంచు తుపానుతో అమెరికాలో మరిన్ని రాష్ట్రాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. లూసియానా(Louisiana), ఫ్లోరిడా, అలబామా, జార్జియా సహా 10 రాష్ట్రాల్లో మంచు దుప్పటి కప్పేసింది. ఎంతలా అంటే 11 ఇంచుల మేర. టెక్సాస్ నుంచి ఫ్లోరిడా వరకు వేల కిలోమీటర్ల సముద్ర తీరం మొత్తం మంచు పేరుకుపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లూసియానా, అలబామాలో 11, ఫ్లోరిడాలో 10, జార్జియాలో 8 ఇంచుల మేర హిమపాతం ఏర్పడింది. అమెరికా చరిత్రలో 6 దశాబ్దాల తర్వాత ఇంతటి విపత్తు ఏర్పడినట్లు అక్కడి వాతావరణ నిపుణుడు జోనాథన్ పార్టర్ తెలిపారు. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేయగా, స్కూళ్లను మూసివేశారు.
కార్లు ఢీకొనడం, ఇతర కారణాలతో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 1963లో ఈ తరహా మంచు తుపాను రాగా, 62 ఏళ్ల తర్వాత మరోసారి కనిపించింది. వచ్చే ఏడు రోజుల్లో చలి డేంజరస్ గా మారుతుందని లూసియానా గవర్నర్ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ సహా ఐరోపా దేశాలు సైతం హిమపాతానికి గజగజ వణికిపోతున్నాయి.