
Published 13 Jan 2024
ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఎదురుచూస్తున్న అపూర్వ వేడుక కోసం పుడమి పులకించిపోతుందా అన్నట్లుగా అందరిలోనూ ఆతృత కనపడుతోంది. ఏళ్ల నాటి కల ఎప్పుడెప్పుడా అనుకుంటూ హిందూ ప్రజలంతా కళ్లగప్పగించి చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర(Ram Temple) ప్రతిష్ఠాపన కోసం భారతీయులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ప్రవాసులు అత్యంత ఆసక్తితో కనిపిస్తున్నారు. అందుకే చాలా దేశాలు ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వంటి ప్రఖ్యాత ప్రదేశాల్లో ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని లైవ్ గా వీక్షించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతున్నారు అక్కడి అధికారులు. రామ మందిర భూమి పూజ కోసం సైతం 2020లో టైమ్ స్క్వేర్ వద్ద ప్రత్యక్ష వేడుకల్ని ప్రసారం(Telecast) చేశారు. తాజాగా మరో దేశమూ ఏకంగా ఆ సమయంలో ‘హాలిడే’ను ప్రకటించింది.
మహోన్నత ఘట్టానికి మారిషస్…
బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం మారిషస్ ప్రభుత్వం రెండు గంటల పాటు ప్రత్యేక హాఫ్ డే సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా గల హిందువులందరికీ ఈ హాలిడే వర్తిస్తుందని తెలిపింది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఆ రెండు గంటల కార్యక్రమాన్ని తిలకించేలా మధ్యాహ్నం రెండు గంటల పాటు సెలవు ప్రకటిస్తున్నట్లు స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జగన్నాథ్ ప్రకటన(Announcement) చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఈనెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు మొత్తం రెండు గంటల సమయం కోసం హాలిడే ఇస్తున్నట్లు మారిషన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏడు రోజుల పాటు సాగే ‘రామ్ లల్లా’ వేడుకలు ఈ నెల 16 నుంచే ప్రారంభమవుతాయి.