వరుస ఘర్షణలతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్(Bangladesh) సంపూర్ణ మతపరమైన దేశంగా మారబోతున్నట్లే కనపడుతున్నది. ఆ దేశంలో 90 శాతం మంది ఒకే మతం(ముస్లిం) వారు కావడంతో రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెక్యులరిజం, సోషలిజం పదాలు తొలగించాలంటూ అక్కడి అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వాదించారు. 2011లో అవామీ లీగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగంలోని 15వ సవరణపై సుప్రీంలో విచారణ సాగింది. 90 శాతం మంది ఒకే మతం ఉండటం వల్ల ఇక దేశంలో లౌకిక పదం ఉండకూడదన్న చర్చ జరిగింది.
జస్టిస్ ఫర్హా మహబూబ్, దేబ్ శిష్ రాయ్ ఎదుట వాదనలు జరగ్గా… బంగ్లా అటార్నీ జనరల్ మహ్మద్ అసజ్జమాన్ కీలక కామెంట్స్ చేశారు. రాజ్యాంగ సవరణలు నియంతృత్వాన్ని కాకుండా సంస్కరణలకు అనుగుణంగా ఉండాలని వాదించారు. షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత ఆమెను భారత్ నుంచి స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్న సర్కారు.. తాజాగా లౌకిక పదాన్ని తొలగించేలా నిర్ణయం తీసుకునేలా ఉంది. షేక్ ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ జాతిపిత అయినా అలా పిలవడం దేశాన్ని విభజిస్తున్నదని అటార్నీ జనరల్ గుర్తు చేశారు.