అరాచకాలకు అడ్డాగా మారిన బంగ్లాదేశ్ లో వికృత పోకడలకు అంతులేకుండా పోయింది. మైనార్టీలపై దాడులకు దిగుతూ భయంకరంగా తయారైన ఆ దేశం ఏకంగా తమ జాతిపిత పేరునే మార్చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రహ్మాన్ బంగ్లా జాతిపిత(Father Of The Nation)గా కొనసాగుతున్నారు. కానీ అక్కడి మహ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం.. ముజిబుర్ రహ్మాన్ పేరు తొలగించింది. స్వాతంత్ర్యానికి పూర్వం పాకిస్థాన్ భూభాగంలో ఈస్ట్ పాకిస్థాన్ గా ఉన్న బంగ్లాదేశ్.. ప్రత్యేక దేశం కావాలని ఉద్యమాలు చేసింది. దీంతో 1971 మార్చి 26న కొత్త దేశంగా అవతరిస్తే అందుకోసం కృషి చేసిన ముజిబుర్ నే జాతిపితగా చేసుకున్నారు అక్కడి ప్రజలు.
కానీ మహ్మద్ యూనస్ సర్కారు మాత్రం ముజిబుర్ రహ్మాన్ పేరు మార్చి జియావుర్ రహ్మాన్ ను తెరపైకి తెచ్చింది. అక్కడి కొత్త పాఠ్య పుస్తకాల్లో జియావుర్ పేరును కొత్తగా చేర్చారు. మార్చి 26న జియావుర్ రహ్మాన్ బంగ్లాకు స్వాతంత్ర్యం తెచ్చారు.. మార్చి 27న బంగబంధు పేరుతో ముజిబుర్ రహ్మాన్ మరో స్వాతంత్ర్య ప్రకటన చేశారు.. అంటూ పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా బయటపెట్టింది.