ప్రకృతి విలయం వల్ల ఎంతటి పరిణామాలు ఉంటాయో అమెరికాలోని లాస్ ఏంజెలిస్(Los Angeles)ను చూస్తే తెలుస్తుంది. అక్కడ నిప్పంటుకుని ఎగిసిన అగ్నికీలలతో వేలాది ఇళ్లు కాలి, కూలిపోయాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడి తరహాలో.. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు పడ్డ మాదిరిగా పరిస్థితి తయారైంది. అత్యంత వినాశకరమైన కార్చిచ్చుగా మారి నగరం బూడిదగా తయారైంది. అడవుల్లో అంటుకున్న మంటలకు భీకరమైన శాంటా(Santa Ana) అనా గాలులు ఆజ్యం పోయడంతో ఇప్పటికే 10 మంది మృతి చెందగా, నగరంలో కిలోమీటర్ల దూరం పొగలు కమ్ముకుని చీకటి ఏర్పడింది. లక్షన్నర మందిని శిబిరాలకు తరలించగా, బుల్డోజర్ల ద్వారా రోడ్లను క్లియర్ చేస్తున్నారు. 30 వేల మంది నిరాశ్రయులైతే మరో 2 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు.
వైమానిక సేవలు అందిద్దామన్న బలమైన గాలుల వల్ల అది సాధ్యం కాకపోవడంతో అక్కడి గవర్నర్.. ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎగిరిపడే నిప్పురవ్వలతో ట్రాన్స్ ఫార్మర్లు ఎక్కడికక్కడ పేలిపోయి విధ్వంసం ఏర్పడింది. సమీపంలోని కాలిఫోర్నియా వెళ్దామని అనుకున్నా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు సాధ్యపడలేదు. హాలీవుడ్ సెలబ్రిటీలకు కేంద్రమైన కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్ దయనీయంగా మారిపోయాయి. అక్కడి అగ్నికీలలతో పేలుళ్లు ఏర్పడి ఆటమ్ బాంబ్ విధ్వంసాన్ని గుర్తు చేయగా, హాలీవుడ్ నటుల్ని సైతం అక్కణ్నుంచి తరలించాల్సి వచ్చింది.