భారత్ ను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలకు పాల్పడుతున్న ఖలిస్థానీలకు మద్దతిచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానితోపాటు లిబరల్ పార్టీ చీఫ్ నుంచి వైదొలుగుతున్నారు. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న దేశీయ సవాళ్లు, సొంత పార్టీలో అసమ్మతి, డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో ట్రూడో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. రాజీనామా చేయాలంటూ లిబరల్ పార్టీ MPలు 20 మంది సంతకాలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ట్రూడో విధానాల్ని విమర్శించిన డిప్యూటీ PM క్రిస్టియా ఫ్రీలాండ్ మొన్న డిసెంబరులో ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ప్రధాని రాజకీయ జిమ్మిక్కుల్ని ఫ్రీలాండ్ ఎండగట్టడంతో ట్రూడో ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలతో సోమవారం పొద్దున్నుంచీ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు. భారత్ తో పెట్టుకుంటే అంతే మరి అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈయన పాలనలో భారత్-కెనడా సంబంధాలు బాగా దిగజారాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందటూ వారిని దేశం నుంచి బహిష్కరించారు. పంజాబ్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ కెనడా కేంద్రంగా ఖలిస్థానీ వేర్పాటు వాదులు ఎన్నో ఏళ్ల నుంచి నిరసనలు తెలుపుతున్నారు. అలాంటి వారిని మోదీ అణచివేయగా, ట్రూడో మాత్రం ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం వెనకేసుకొచ్చారు.