
కశ్మీర్ సున్నిత ప్రాంతాల్లో సంచరిస్తున్న చైనా యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబరు 19న టూరిస్ట్ వీసాపై హు కంగ్టోయ్(29) ఢిల్లీ వచ్చాడు. నిబంధనల్ని ఉల్లంఘించి కశ్మీర్లోని లేహ్, జంస్కార్ ప్రాంతాల్లో ఉన్నాడు. బౌద్ధమత ప్రాంతాలైన వారణాసి, ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, సారనాథ్, గయ, కుశీనగర్ కు మాత్రమే అతడికి అనుమతి ఉంది. కానీ జంస్కార్లో అతడు 3 రోజులు బస చేశాడు. అవంతిపోరా వెళ్లాడు. ఆర్మీ విక్టర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంతోపాటు హజ్రత్ బల్ మందిరం, శుక్రాచార్య కొండ, దాల్ సరస్సు, మొఘల్ గార్డెన్ వంటివి అక్కడున్నాయి. భారతీయ సిమ్ కార్డు తీసుకుని అనుమానాస్పదంగా కనిపించాడు. గత తొమ్మిదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నానని, బోస్టన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదువుతున్నట్లు విచారణలో తెలిపాడు. అతడు ఇప్పటికే న్యూజిలాండ్, బ్రెజిల్, ఫిజీ, హాంకాంగ్ దేశాలు చుట్టివచ్చినట్లు గుర్తించారు.