Published 15 Jan 2024
ఇంటిల్లిపాది సంతోషంగా గడిపే వేడుక పండుగ. గాల్లోకి పతంగులు ఎగరస్తూ పిల్లా పెద్దా తేడా లేకుండా సంక్రాంతికి చేసే హడావుడి అంతాఇంతా కాదు. కానీ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆ పండుగ కాస్తా కొందరికి విషాదంగా మారుతున్నది. అత్యంత ప్రమాదకరంగా భావించి ప్రభుత్వమే నిషేధించిన చైనా మాంజాను వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. ఈ చైనా మాంజా వల్ల ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడి ఫ్లైఓవర్ పైన చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని జవాన్ కోటేశ్వర్ రెడ్డి కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స(Treatment) అందిస్తుండగానే కన్నుమూశారు.
ఏఎస్ఐ కుమారుడు మృతి…
జగిత్యాల జిల్లా కోరుట్ల అల్లమయ్య గుట్ట వద్ద బైక్ పై వెళ్తుండగా మెట్ పల్లికి చెందిన బట్టు శంకర్ అనే వ్యక్తి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. మెడకు తాకి గొంతు కోయడంతో గాయమైంది. అతడు తృటిలో ప్రాణాలు తప్పించుకుని హాస్పిటల్ లో చేరాడు. హైదరాబాద్ నాగోల్ లోనూ నాలుగో అంతస్తు పై నుంచి పంతంగి ఎగురవేస్తూ ఎనిమిదేళ్ల శివప్రసన్న అనే అబ్బాయి మృతి చెందాడు. పేట్ బషీరాబాద్ లోనూ గాలిపటం ఎగరేస్తూ బిల్డింగ్ పై నుంచి కిందపడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్వాల్ లో ASIగా పనిచేస్తున్న రాజశేఖర్ కుమారుడు ఆకాశ్ గా అతణ్ని గుర్తించారు. ఇక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జోహెల్ అనే 12 ఏళ్ల బాలుడికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతణ్ని హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
అత్తారింటికి వచ్చి అంతలోనే…
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో విషాదం జరిగింది. చిన్నారులతో కలిసి గాలిపటం ఎగరేస్తున్న టైమ్ లో అది కరెంటు తీగలకు చుట్టుకుంది. దాన్ని తీస్తుండగానే షాక్ తగిలి సుబ్రమణ్యం అనే వ్యక్తి బంగ్లా పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. అత్తగారింటికి పండుగ కోసం వచ్చిన కృష్ణా జిల్లాకు చెందిన ఇతడికి ఆసుపత్రిలో వైద్యమందిస్తుండగానే ప్రాణాలు విడిచారు.
చైనా మాంజా ఎందుకు వాడొద్దంటే…
- గతంలో పతంగులను ఎగురవేసేందుకు కాటన్ దారం వాడేవారు. గాజుపిండి, సాబ్దానా వంటి వాటితో మాంజాను తయారు చేసేవారు.
- కానీ చైనా మాంజా రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కెమికల్స్ పూసిన మాంజాతో పక్షులు, మనుషులకు ప్రమాదాలు జరుగుతున్నాయి.
- మన రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే దీన్ని నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొన్నా నేరమే.
- సాధారణ మాంజాతో పోల్చితే దీని ధర తక్కువ కావడంతో ఎక్కువమంది దీన్నే వాడుతున్నారు.
- ముంబయి, పంజాబ్, గుజరాత్ నుంచి రాష్ట్రానికి సప్లయ్ అవుతుండగా… ఓల్డ్ సిటీ నుంచి మిగతా ప్రాంతాలకు రవాణా అవుతోంది.