
Published 07 Jan 2024
భారతదేశంపైనే అత్యధికంగా ఆధారపడి.. పర్యాటక(Tourism) రంగంతో ఏటా బిలియన్ డాలర్లు సంపాదిస్తున్న మాల్దీవులు.. ఆ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయింది. ఆ దేశ నేతల వ్యవహారశైలిపై మండిపడుతున్న భారతీయులు.. ‘మాల్దీవుల బాయ్ కాట్’ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు(Celebrities) దీనికి మద్దతు తెలుపుతుండగా దేశవ్యాప్తంగా నెటిజన్లు.. మాల్దీవుల వ్యతిరేక కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు వీసా అవసరం లేకుండానే భారతీయులను తమ దేశాలకు ఆహ్వానిస్తున్నాయి. వీసా-ఫ్రీ ద్వారా టూరిజం ఆదాయాన్ని పెంచుకునేందుకు 23 దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.
అసలేం జరిగింది…!
కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష్యద్వీప్ లో నరేంద్ర మోదీ పర్యటన.. హిందూ మహాసముద్ర ఐలాండ్ దేశమైన మాల్దీవుల్లో కలకలం రేపింది. 36 ద్వీపాల సముదాయమైన లక్ష్యద్వీప్ ను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అక్కడ విహరించారు. సముద్రం ఒడ్డున కూర్చోవడం.. సాహసోపేతంగా స్నార్కేలింగ్ అనే స్విమ్మింగ్ చేసి సముద్రగర్భం చుట్టివచ్చారు. ప్రకృతి అందాల్లో సేదతీరిన ఫొటోలు, వీడియోలను తన ‘X’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ప్రధాని పర్యటనపై మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మాజుమ్ మజీద్ చేసిన పోస్ట్ పై వివాదం మొదలైంది. మాల్దీవుల్ని టార్గెట్ చేసుకుంటూ మోదీ చేసిన లక్ష్యద్వీప్ టూర్.. బీచ్ టూరిజంలో భారత్ తమతో పోటీపడటం సవాలేనని అన్నారు. అటు ఆ దేశానికి చెందిన MP సైతం తమతో పోటీపడటం భ్రమే అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
భారతీయుల మండిపాటు…
భారత్ వల్లే పర్యాటకంగా భారీగా సంపాదిస్తున్న దేశం చివరకు తమనే టార్గెట్ గా చేసుకోవడంపై మనవాళ్లు మండిపడుతున్నారు. మాల్దీవులకు ఆల్టర్నేటివ్ లక్ష్యద్వీపే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించి.. మా దగ్గర టూరిజం డెవలప్ చేసుకుంటే తప్పేంటన్నారు. ఈ పరిణామంతో షాక్ కు గురైన మాల్దీవుల ప్రభుత్వం… అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురు మంత్రులను తొలగించింది. ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్(PPM)కు చెందిన కౌన్సిల్ సభ్యుడు జాహిద్ రమీజ్, మంత్రి మరియమ్ షియానా సైతం తీవ్రమైన మాటలు మాట్లాడారు. ఈ కామెంట్స్ ను మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఖండించారు.
మాల్దీవుల మాదిరిగా..
మాల్దీవులకు ఉత్తర దిశగా ఉన్న లక్ష్యద్వీప్ ను అభివృద్ధి చేసేందుకు గాను రూ.1,050 కోట్లను మోదీ సర్కారు కేటాయించింది. చైనా అనుకూల వాది అయిన మహ్మద్ మయిజ్ఞు మాల్దీవుల అధ్యక్షుడుగా ఉన్నారు. మాల్దీవ్స్ నేతల కామెంట్స్ తో ఆ దేశానికి చెందిన వెబ్ సైట్లన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్ తో డౌన్ అయ్యాయి. 1988లో శ్రీలంక జరిపిన దాడిని అడ్డుకుని మాల్దీవుల అధ్యక్షుణ్ని రక్షించిన భారత్ ను.. ప్రస్తుతం ఆ దేశానికే తలమానికంగా మారిన భారతీయుల ప్రతినిధి అయిన ప్రధానిపై ఇలా నోరు పారేసుకోవడంతో మాల్దీవుల బాయ్ కాట్ ఉద్యమం అంతకంతకూ ఉద్ధృతమవుతోంది.