ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టే దీనగాథ ఇది. బాంబుల మోతలు, సైరన్లు, భూమి బద్ధలయ్యే సౌండ్స్ తో ఆ దంపతులు పడ్డ వేదన అంతాఇంతా కాదు. చివరకు ఎంబసీకి ఫోన్ చేస్తే సిబ్బంది అంతా బంకర్లలోకి వెళ్లిపోవడంతో అటు నుంచి నో రెస్పాన్స్. ఇదీ కేరళ దంపతులకు ఎదురైన దయనీయ స్థితి. తిరువనంతపురానికి చెందిన విజయ్ కుమార్(64), ఉషాదేవి(59) జంట గత నెలలో ఇజ్రాయెల్ వెళ్లింది. టెల్ అవీవ్ లోని బార్ ఇలాన్ యూనివర్సిటీలో PhD చదువుతున్న తమ కుమార్తె అనఘాను చూసేందుకు వెళ్లారు. ఆదివారం నాడు స్వదేశానికి తిరిగి రావాల్సిన ఆ దంపతులు.. ఇజ్రాయెల్ కు ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో అక్కడే చిక్కుకుపోయారు.
మెడిసిన్ కోసం బయటకొస్తే
బ్లడ్ ప్రెజర్, ప్రొస్టేట్ సమస్యతో బాధ పడుతున్న విజయ్ కుమార్.. మెడిసిన్ తెచ్చుకుందామని బయటకు వెళ్లారు. భార్య ఉషాతోపాటు అనఘా క్లాస్ మేట్ అయిన మనోజ్ షణ్ముగ సుందరంతో కలిసి సోమవారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చారు. బస్టాప్ లో ఉన్న టైమ్ లో సైరన్లు మోగడంతో గుండెల్లో దడ మొదలైంది.
ఎదురుగా రాకెట్లు, బాంబుల వర్షం. ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. బతుకుజీవుడా అంటూ ఒక్కసారిగా పరుగందుకుని పక్కనున్న అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోకి వెళ్లాలనుకున్నారు. కానీ అక్కడ గేట్స్ మూసి ఉన్నాయి. ఎవరూ కనిపించకపోవడంతో కొద్దిసేపు వేచి చూశాక యూనివర్సిటీలోని తమ కుమార్తె వద్దకు బయల్దేరారు. ఆ వర్సిటీ గేట్లు కూడా క్లోజ్ అవడంతో ఏం చేయాలో తోచలేదు. చివరకు అక్కడి పోలీసులు గుర్తించి ఆ దంపతుల్ని బాంబ్ షెల్టర్లకు షిఫ్ట్ చేశారు.
ఎంబసీ నుంచి ‘నో రెస్పాన్స్’
ఇటు మెసిసిన్ లేక ఇబ్బందులు.. అటు బాంబుల మోతలతో ఏం చేయాలో అర్థం కాలేదా పెద్దాయనకు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేస్తే అందరూ బంకర్లకు వెళ్లిపోయారని సమాచారం వచ్చింది. ఆదుకునేవారు లేక గుండెలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితుల్లో అనుకోని అతిథుల్లా వచ్చారు మన దేశానికే చెందిన కొందరు వ్యక్తులు. ఇజ్రాయెల్ లోని భారత అసోసియేషన్ సభ్యులు ఆ దంపతుల దగ్గరకు వెళ్లి వారు కోరిన మందులు అందించి మానవత్వం చాటుకున్నారు. ‘గతంలో బాంబు దాడుల్ని టీవీల్లో చూసేవాళ్లం.. ఇప్పుడు వాటిని కళ్లారా చూస్తున్నాం’ అంటూ ఆ భార్యభర్తలు ఆవేదనను పంచుకున్నారు.