
రష్యా తిరుగుబాటు నేత యెవ్ గెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించామని రష్యా అధికారికం(Official)గా ప్రకటించింది. ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని ఆ దేశ విచారణ కమిటీ ధ్రువీకరించింది. రష్యా ప్రైవేటు సైన్యమైన వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్… పుతిన్ తీరును నిరసిస్తూ తిరుగుబాటుకు యత్నించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆయన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పుతిన్ హస్తమే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. ప్రిగోజిన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని తిరుగుబాటు జరిగిన కొద్ది రోజులకే అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
ఇక ప్రమాదంలో ప్రిగోజిన్ తోపాటు ప్రాణాలు కోల్పోయిన మొత్తం 10 మంది మృతదేహాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపారు. ఆ 10 మంది సైతం ప్రిగోజిన్ కు అత్యంత నమ్మకమైన హైలెవెల్ లెఫ్టినెంట్లు అని రష్యా సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఉక్రెయిన్ వార్ లో అనాలోచితంగా వ్యవహరిస్తూ సైనికుల ప్రాణాలు తీస్తున్నారంటూ వ్లాదిమిర్ పుతిన్ పై మండిపడ్డారు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆయన పుతిన్ తో రాజీకి వచ్చారు. క్రెమ్లిన్ నాయకత్వం నుంచి వచ్చిన మెసేజ్ తో జూన్ 23, 24 తేదీల్లో పుతిన్ తో ప్రిగోజిన్ భేటీ అయ్యారు. చర్చల అనంతరం 24 గంటల్లోనే తిరుగుబాటును విరమిస్తున్నట్లు ప్రకటించి ప్రిగోజిన్ అదృశ్యమయ్యారు. రష్యాలో ఉండటం ఇష్టం లేకుంటే ఆయన పోలండ్ వెళ్లొచ్చని పుతిన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అప్పట్నుంచి ప్రిగోజిన్ మళ్లీ బయట కనిపించలేదు.