
ప్రపంచంలో మరో భారీ విపత్తు సంభవించింది. తాజాగా చోటుచేసుకున్న అతి పెద్ద భూకంపం(Earth Quake)తో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం అర్థరాత్రి వచ్చిన భూకంపానికి ఊహించని రీతిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటివరకు 1,305 చనిపోయారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అట్లాస్ పర్వత శ్రేణుల్లో కేంద్రీకృతమైన భూకంప కేంద్రం… మొరాకోపై విరుచుపడ్డ ఘటనలో మరో 1,832 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రికి 1,037 మంది మరణించినట్లు ప్రకటించగా.. ఈరోజు అది మరింత పెరిగింది. దేశంలోని మేజర్ సిటీల్లో భూకంపం రావడంతో వల్ల పెద్దసంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. రాజధాని రబాట్ తోపాటు దేశంలోనే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన మెరాకెక్ సిటీలో భారీస్థాయిలో బిల్డింగ్స్ నేలమట్టమయ్యాయి. భూకంప తీవ్రతతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి హాహాకారాలు చేయడంతో మొరాకోలో భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రిక్టర్ స్కేల్ పై 6.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది.

హాహాకారాలు… భీతావహ వాతావరణం
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం భారీయెత్తున గాలింపు కొనసాగుతున్నది. హాహాకారాలు, ఆర్తనాదాలతో మొరాకో పట్టణాలు దయనీయంగా తయారయ్యాయి. భవనాల కింద చిక్కుకున్న వారి కోసం అక్కడి వారు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. మట్టి గోడలు, భవనాల పై కప్పులు కూలిన ఘటనలో వాటి కింద మరింత మంది ఉండవచ్చన్న కోణంలో అక్కడి రెస్క్యూ ఫోర్సెస్.. గత 30 గంటల నుంచి విస్తృత గాలింపు నిర్వహిస్తున్నాయి. మెరాకెక్ కు 40 కిలోమీటర్ల దూరంలోని అస్ని గ్రామంతోపాటు దాని పరిసర విలేజ్ ల్లో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. బాధితులకు సహాయం అందించేందుకు అల్జీరియా నుంచి టీమ్ లు బయల్దేరాయి. మరోవైపు తమకు సహకారం అందించాలని ప్రపంచ దేశాలను మొరాకో ప్రభుత్వం కోరింది. అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి(International Monitoring Fund) సైతం బాధితులను ఆదుకుంటామని తెలిపింది. ఇందుకు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాలని UNOలోని దేశాలకు సూచించింది.
ఆరు దశాబ్దాల తర్వాత అతి పెద్దది ఇదే
రిక్టర్ స్కేల్ పై 7 తీవ్రత రికార్డయిందని మొరాకో భూకంప కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఆఫ్రికా దేశాల్లో భూకంపాలు అత్యంత అరుదు(Rare)గా వస్తుంటాయి. 1960 అగాదిర్ లో 5.8గా నమోదైన భూకంపంలో 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా భూకంప కేంద్రం మెరాకెక్ సౌత్ ప్రాంతాల్లోని పర్వతాల్లో 18.5 కిలోమీటర్ల లోతులో ఏర్పడ్డట్లు అమెరికన్ జియాలాజికల్ సర్వే ప్రకటించింది.. గత ఫిబ్రవరిలో తుర్కియే దేశంలో సంభవించిన భూకంపంతో 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.