
భూకంపం(Earth Quake) సృష్టించిన విలయంతో అఫ్గానిస్థాన్ అతలాకుతలమైంది. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైన ప్రకంపనల ధాటికి 2,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం సంభవించిన భూకంపం నార్త్ వెస్ట్ ప్రావిన్స్ రాజధాని అయిన హెరాత్ కు 30 కిలోమీటర్ల దూరంలో భూకంప స్థానం కేంద్రీకృతమైంది. ఎటుచూసిన మట్టి దిబ్బలు, అందులో కూరుకుపోయిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. హెరాత్ ప్రావిన్స్ లోని 12 గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని, 5,000 మంది నిరాశ్రయులుగా మారారని అక్కడి సర్కారు తెలిపింది. భారీ భూకంపానికి గురైన అఫ్గానిస్థాన్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) టీమ్ లు సహాయక చర్యలు అందిస్తున్నాయి.
ఒంటెద్దు పోకడతో తీవ్ర సంక్షోభం
2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంటెద్దు పోకడలకు పోయింది. విదేశీ సాయాన్ని ఉపసంహరించుకోవడంతో ఇప్పటికే ఆ దేశం విపరీతమైన ఆర్థిక సంక్షోభం(Economic Crisis)లో చిక్కుకుంది. ఇరాన్ సరిహద్దు ప్రాంతమైన హెరాత్ లో 1.9 కోట్ల మంది నివసిస్తున్నారు. ఇప్పటికే కరవు బారిన పడిన అఫ్గానిస్థాన్ తాజా భూకంపంతో ఒక్కసారిగా కకావికలమైంది. తాలిబన్ దేశంలో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని యురేషియన్, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ల జంక్షన్ కు సమీపంలో ఉండటంతో అఫ్గానిస్థాన్ భూకంపాల బారిన పడుతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గతేడాది జూన్ లో 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 1,000 మంది మృత్యువాత పడ్డారు.