Published 19 Dec 2023
భారీ భూకంపం ధాటికి పెద్దయెత్తున ప్రాణ నష్టం జరగడంతో చైనా అతలాకుతలమైంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత(Magnitude) 6.1గా నమోదైంది. ఆ దేశ పశ్చిమ ప్రాంతంలోని గాన్సు-క్వింగాయ్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 120 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. యూరోపియన్ మెడిటెరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) ప్రకారం తీవ్రత 6.1గా రికార్డయింది. పశ్చిమ నైరుతి ప్రాంతంలోని లాంఝౌకు 102 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు EMSC తెలిపింది.
మృతుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశముంది. భూకంప తీవ్రతకు అక్కడి ప్రాంతంలోని నివాసాలన్నీ నేలమట్టమయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో తలెత్తిన ఉపద్రవంతో చాలా మంది నిద్రలోనే కన్నుమూశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గాన్సు-క్వింగాయ్ తోపాటు జిషిషాన్ ప్రాంతంలోనూ భూమి కంపించగా ఇప్పటివరకు ఈ దుర్ఘటనలో 300 మందికి పైగా గాయపడ్డట్లు చైనా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.