ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాను ఆంక్షల చట్రంలో ప్రపంచ దేశాలు ఉంచినా.. ఇప్పటికీ ఆ దేశం భారత్ కు అత్యంత నమ్మకమైన స్నేహితురాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. అందుకే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో(Crucial Period)నూ రష్యా నుంచి చమురు(Oil) కొనుగోలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు తమకు అనుకూలమైన సందర్భాల్లో భారత్ తో ఎడమొహం, పెడమొహంగా ఉన్నాయి.. కానీ రష్యా మాత్రం ఇప్పటిదాకా ఏనాడూ ఆ పనిచేయలేదని జయశంకర్ తెలిపారు. జర్మనీలో నిర్వహిస్తున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన.. అక్కడి మీడియా సంస్థ అయిన ‘హండెల్స్ బ్లాట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
భారత్-రష్యా కమిట్మెంట్ పై…
‘భారత్-రష్యా మధ్య సుదీర్ఘ కాలంగా మిత్రుత్వం కొనసాగుతున్నది.. రష్యా ఏనాడూ, ఏ దశలోనూ భారత్ కు హాని చేయలేదు.. ప్రతి దేశం తమ విదేశీ సంబంధాల విషయంలో గతం నుంచి కొనసాగుతున్న రిలేషన్ షిప్ లోని అనుభవాల ప్రకారమే నడుచుకుంటాయి.. భారత్ కు ఈ విషయంలోనూ పెద్దగా తేడా లేదు.. స్వాతంత్ర్యం రాక ముందు నుంచీ రష్యా మాకు మిత్రదేశంగా ఉంది.. కొన్ని దేశాలు తమ విషయంలో మాట మార్చిన సందర్భాలున్నాయి, కానీ రష్యా ఎప్పుడూ ఆ పనిచేయలేదు.. అమెరికా, చైనా, యూరప్, జపాన్ వంటి దేశాలు కూడా కొన్ని సందర్భాల్లో భారత్ తో దూరంగా ఉన్నాయి.. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా రష్యా మాకు ఎప్పుడూ దూరంగా ఉండలేదు.. అని జైశంకర్ క్లారిటీ ఇచ్చారు.