
Published 24 Nov 2023
48 రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతల్లో(Israel-Hamas Conflict) శుక్రవారం(నవంబరు 25) నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్-గాజా మధ్య నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం ఈరోజు ఉదయం నుంచి అమలులోకి రాగా.. తమ చెరలో ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టింది. ఫస్ట్ బ్యాచ్ లో భాగంగా 25 మందిని అప్పగించగా.. అందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, మరో 12 మంది థాయ్ లాండ్ వాసులు ఉన్నారు. అందుకు ప్రతిగా ఇజ్రాయెలీ జైళ్లల్లో నుంచి హమాస్ సభ్యులను అప్పగించనున్నారు. ఈ నాలుగు రోజుల కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పంద రోజుల్లో మొత్తం 150 మంది పాలస్తీనాకు చెందిన హమాస్ అనుకూల వ్యక్తుల్ని విడిచిపెట్టాల్సి ఉంది. అందులో భాగంగా తొలి రోజైన ఇవాళ 39 మందిని ఇజ్రాయెల్ సర్కారు విడిచిపెట్టింది.
అక్టోబరు 7న జరిగిన హమాస్ దాడిలో 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా.. 240 మందిని హమాస్ అపహరించింది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య భారీ యుద్ధం జరుగుతున్నది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ జరిపిన ముప్పేట దాడిలో 14,000 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడితే అందులో 40 శాతం చిన్నారులున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. మిలిటెంట్లు తమకు అనుకూలంగా మార్చుకున్న గాజాలోని అల్-షిఫా హాస్పిటల్ ను స్వాధీనం చేసుకోగా.. ఈరోజు అక్కణ్నుంచి తమ బలగాలను నెతన్యాహూ సర్కారు ఉపసంహరించుకుంది.