
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో దక్షిణ కొరియాలో 33 మంది మృతి చెందారు. వెహికిల్స్ ప్రయాణించే సొరంగంలోకి నీరు చేరడంతో 15 వాహనాలు మునిగిపోయాయి. దక్షిణ కొరియా చెంగ్జూలోనీ హైవేపై గంగ్ ప్యోంగ్ సొరంగంలోకి ఒక్కసారిగా ఫ్లడ్ వాటర్ ప్రవేశించింది. కార్లు, బస్సు సహా మొత్తం 15 వెహికిల్స్ అందులో చిక్కుకుపోయాయి. సొరంగంలో చిక్కుకుపోయిన బస్సు నుంచి ఏడు మృతదేహాల్ని బయటకు తీశారు. వందల మంది భద్రతా సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సొరంగం పొడవు అర కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉండటం… భారీగా వాటర్ చేరడంతో అందులోకి వెళ్లడానికి కష్టతరంగా మారింది.
చెంగ్జూ నగరంలో భారీ వర్షాలు పడుతుండటంతో అకస్మాత్తుగా వరద ఉప్పెనలా వచ్చినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. వరద స్పీడ్ గా సొరంగంలోకి చొచ్చుకెళ్లడంతో అందులోని వాహనాల నుంచి ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఏడుగురి మృతదేహాల్ని బయటకు తీయగా… 10 మంది గల్లంతైనట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు ఈ వర్షాలకు 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. రాజధాని సియోల్ లోనూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుండగా… మరిన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని దక్షిణ కొరియా వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.