తుపాకీ(Gun) సంస్కృతి(Culture)కి నిలయమైన అగ్రరాజ్యం అమెరికాలో… దుండగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో అమెరికన్లే కాదు.. భారతీయలు బలవుతున్నారు. విచ్చలవిడిగా జరుపుతున్న కాల్పులతో అమెరికాలోని కొన్నిచోట్ల భారత సంతితి జనం భయం గుప్పిట కాలం గడపాల్సి వస్తున్నది. గత రెండు నెలల కాలంలోనే ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. భారతీయులు, భారత(Indian) సంతతి(Origin)కి చెందిన వ్యక్తులపై కాల్పులకు తెగబడుతూనే ఉన్నారు దుండగులు.
తాజాగా కళాకారుడిపై…
సంప్రదాయ నృత్య కళాకారుడు, కూచిపూడి, భరతనాట్యాల్లో ప్రవీణుడైన అమర్ నాథ్ ఘోష్(34)పై.. మిస్సోరీ(Missouri) రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ అకాడెమీ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పలు రౌండ్లపాటు కాల్పులు జరపడంతో అమర్ నాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత రెండు నెలల కాలంలోనే ఏడు దాడి సంఘటనలు జరిగాయి. ఇటీవల USలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు మరణించడంపైనా అక్కడి అధ్యక్షుడు జో బైడెన్ సైతం సీరియస్ గా తీసుకున్నారు.
ఇవే ఘటనలు…
జార్జియాలోని స్టోర్ లో పనిచేస్తున్న వివేక్ సైనీ.. ఇండియానా యూనివర్సిటీలో సయ్యద్ మజహర్ అలీ.. లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శ్రేయాస్ రెడ్డి.. ఇలినాయిస్ వర్సిటీలో అకుల్ ధావన్.. పర్ద్యూ విశ్వవిద్యాలయం(University)లో పనిచేస్తున్న నీల్ ఆచార్య గత కొద్దికాలంలోనే ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. అటు దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలోనూ జరిగిన గొడవలో ఓ కంపెనీ యజమాని మృత్యువాత పడ్డారు. డైనమో టెక్నాలజీస్ కు చెందిన సహ వ్యవస్థాపకుడు(Co-Founder), ప్రెసిడెంట్ అయిన వివేక్ తనేజా(41).. ఓ వ్యక్తితో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడ్డారు. అలెగ్జాండ్రియాలో నివాసం ఉంటున్న ఈయన్ను హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇస్తుండగానే మరణించారు.