బంగ్లాదేశ్ ను షేక్ హసీనా విడిచిపెట్టిన తర్వాత భారీయెత్తున దాడులు జరుగుతున్నాయి. ఆమె పార్టీకి చెందిన అవామీ లీగ్ లీడర్లు 20 మంది హత్య(Murdered)కు గురయ్యారు. దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది. ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కొమిల్లా సిటీలో ఉంటున్న MP షఫీఖుల్ ఇస్లాం షిముల్ ఇంటిపై ఒక గుంపు దాడి చేయడంతో ఆయన కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
హిందువులకు చెందిన 10 మందిరాలతోపాటు వ్యాపారాల్ని దారుణంగా దెబ్బతీస్తూ మెజార్టీ ముస్లిం పార్టీలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. 97 చోట్ల లూటీలు జరిగినట్లు హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ రాణా దాస్ గుప్తా తెలిపారు. బంగ్లాలోని 17 కోట్ల జనాభాలో 8% మంది అంటే 1.36 కోట్ల మంది హిందువులున్నారు. అక్కడ 17 వేల మంది భారతీయులున్నట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ ప్రకటించగా, అందులో కొందరిని స్వదేశానికి తీసుకువచ్చింది.